– ఇక టార్గెట్ 2024 టీ20 ప్రపంచకప్
– రేపటి నుంచి ఆసీస్‌తో పొట్టి సిరీస్
ఐసీసీ ప్రపంచకప్ కల ఆవిరైంది. టీమ్ ఇండియా అజేయ యాత్రకు అర్థరహిత ముగింపు వంద కోట్ల భారతీయులకు గుండెకోత మిగిల్చింది. ఆటలో గెలుపోటములు సహజం, ఓ ఓటమితో ప్రయాణం అక్కడితో ఆగదు. వన్డే వరల్డ్‌కప్ దక్కని దుఖంలో మునిగిన టీమ్ ఇండియా.. 2024 టీ20 ప్రపంచకప్ దిశగా ప్రయాణానికి సిద్ధమైంది. గురువారం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో మిషన్ 2024 షురూ కానుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
2023 ఐసీసీ ప్రపంచకప్ వేటలో ఆఖరు మెట్టుపై తడబడిన టీమ్ ఇండియా.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయంతో స్వాంతన పొందాలని ఆశిస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్‌కు మరో ఆరు నెలల సమయం ఉంది. జూన్ 4, 2024 నుంచి వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా పొట్టి ప్రపంచకప్ జరుగనుంది. అరంగేట్ర 2007 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమ్ ఇండియా మళ్లీ ఈ ట్రోఫీ అందుకోలేదు. 2014 ఢాకాలో టైటిల్ పోరుకు చేరినా.. శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. దీంతో 16 ఏండ్ల పొట్టి ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించేందుకు భారత్ రంగం సిద్ధం చేసుకుంటోంది. భారత్, ఆస్ట్రేలియా ఐదు మ్యాచుల టీ20 సిరీస్ గురువారం విశాఖపట్నం టీ20తో ఆరంభం కానుంది. విశాఖ నుంచే భారత్ టీ20 ప్రపంచకప్ ప్రణాళిక మొదలు కానుంది.
యువ జట్టుతో..
ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత సీనియర్ క్రికెటర్లకు సెలక్షన్ కమిటీ విశ్రాంతి అందించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, జశ్‌ప్రీత్ బుమ్రా సహా శుభ్‌మన్ గిల్‌కు సైతం విరామం దక్కింది. ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన యువ జట్టును ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్య చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. శ్రేయస్ అయ్యర్ రెండో టీ20 నుంచి వైస్ కెప్టెన్‌గా జట్టుతో చేరనున్నాడు. హైదరాబాదీ యువ కెరటం తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అవేశ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోరు, రింకూ సింగ్‌లు టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు.
అదే ఫార్ములా..
2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు 2024లో అమలు చేయనున్నారు. సీనియర్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లేలు టీ20 జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. దీంతో కుర్రాళ్లకే అవకాశం దక్కింది. ఎం.ఎస్ ధోని నాయకత్వ పగ్గాలు అందుకున్నాడు. ఇప్పుడూ సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లకు జట్టులో చోటు ఇవ్వటం లేదు. యువ జట్టును సిద్ధం చేస్తున్నారు. హార్దిక్ పాండ్య నాయకత్వంలో.. ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సహా రానున్న ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మెరిసిన కుర్రాళ్లనే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయనున్నారు. పొట్టి ప్రపంచకప్ నెగ్గిన తొలి జట్టుగా నిలిచిన టీమ్ ఇండియా.. 16 ఏండ్ల విరామానికి తెరదించుతూ 2024 మళ్లీ విజేతగా నిలవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకు సెలక్షన్ కమిటీ 2007 తరహాలో యువ మంత్ర పఠిస్తోంది.
ఆసీస్‌తో సిరీస్‌కు భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబె, రవి బిష్ణోరు, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, శ్రేయస్ అయ్యర్.