– నిందితుడిని కఠినంగా శిక్షించాలి :రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు మగంలా ప్రవర్తించిన ఘటనలో రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బాధ్యుడిపౖౖె తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆమె ఆదేశించారు. ఛైర్‌పర్సన్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి, కమిషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి శారద బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సఖి ప్రతినిధులను ఆదేశించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని, రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం అండ గా ఉంటాయని భరోసా ఇచ్చారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ధైర్యం కల్పించారు. సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని లక్ష్మారెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు.