– తెలంగాణను నెం. వన్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే
– పార్టీలో విభేదాలు సర్దుకుంటాయి
– ఎంఎల్‌ఏ హరిప్రియను మరోసారి గెలిపించాలి
– విలేకరుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నవతెలంగాణ-ఇల్లందు
బీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాజ్యసభ సభ్యులు, ఇల్లందు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత 50 ఏండ్లుగా ఉన్న పోడు సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్ దే అన్నారు. సుమారు 45 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఇందులో ఇంటికి ఒక పథకమైన వర్తింపజేశారని అన్నారు. అనేక ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించారని అన్నారు. దీని మూలంగా ఏడాది పాటు కరువు వచ్చిన తట్టుకునే శక్తి తెలంగాణకు ఉందన్నారు. మూడు లక్షల కోట్ల సంపదను సృష్టించారని అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో సుమారు 16 వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, గత 50 ఏళ్లలో ఇలాంటి అభివృద్ధి చూడలేదన్నారు. బస్ డిపో మంజూరు చేసి గిరిజనుల, ప్రజల కష్టాలు తీర్చారని చెప్పారు. కోరం కనకయ్యకు జెడ్పీ చైర్మెన్ పదవి ఇచ్చి ఆదుకుంటే పార్టీ మారి ద్రోహం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలు నమ్మొద్దని వివరించారు. కేసీఆర్ ఆశీర్వచనాలతో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇచ్చారని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.
బీఆర్‌ఎస్‌లో విభేదాలు సర్దుకుంటాయి
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యనే విభేదాలు వస్తుంటాయని, ఇంత పెద్ద పార్టీలో విభేదాలు రావడం మామూలేనని అన్నారు. మున్సిపల్ చైర్మెన్, ఎమ్మెల్యే మధ్య విభేదాలు చిన్న సమస్యలేనని, త్వరలో సర్దుకుంటాయన్నారు. ఇల్లందు అడ్డా బీఆర్‌ఎస్ గడ్డని గెలుపు తధ్యమని అన్నారు.
ఓటు అడిగే హక్కు కెసిఆర్ కే ఉంది : మహబూబాబాద్ ఎంపీ కవిత
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని ఓటు అడిగే హక్కు వారికే ఉందని ఎంపీ కవిత అన్నారు. గత తొమ్మిది ఏళ్లలో ఇచ్చిన ఇవ్వని హామీలు అన్నీ కూడా అమలు చేసిన ఘనత వారిదే అన్నారు. కోరం కనకయ్యకు బీఆర్‌ఎస్ టికెట్ ఇస్తే ఓడిపోయారని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ జెడ్పీ చైర్మెన్‌ను చేశారన్నారు. వీటన్నిటిని విస్మరించి మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ తరపున పూనుక్కున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు.
బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తాం : ఎంఎల్‌ఏ హరిప్రియ
2014 నుండి ఈనాటి వరకు ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ టికెట్ పై ఎవరు గెలవలేదని, రాబోయే మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్న ఘనత ఇల్లందుకే దక్కిందని అన్నారు. దీనికి కృషి చేసిన పాలకవర్గానికి, చైర్మెన్ డీవీకి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో విభేదాలను చక్కదిద్దుకుంటామని అందర్నీ కలుపుకొని పోతామని అన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దిండిగాల, వైస్ చైర్మన్ జానీ, కౌన్సిలర్లు ఎంపీటీసీలు, ఇల్లందు, టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం చెందిన వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
గులాబీ మయమైన ఇల్లందు
ఎంఎల్‌ఏ హరిప్రియను ఆశీర్వదించి ఇల్లందు అసెంబ్లీ టికెట్ ఇచ్చినందుకు గాను బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారి ప్రదర్శన నిర్వహించారు. తోరణాలతో పట్టణమంతా గులాబీమయం చేశారు. పోలీసులు వివిధ కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కోలాటం, డప్పు, ప్రదర్శన, నృత్యాలు, డీజే చప్పుళ్లతో పట్టణం దద్దరిల్లింది. ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. తొలుత సీఎస్పీ రైల్వే గేటు వద్ద రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత లకు ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సమీపంలోని ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదర్శన గోవింద్ సెంటర్ కొత్త బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ చేరుకున్నది. అక్కడ జరిగిన బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత మాట్లాడారు. అనంతరం ప్రదర్శన సాగుతూ జగదాంబ సెంటర్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శనగా సాగుతూ ప్రభుత్వ వైద్యశాల సెంటర్ మీదుగా జెకె ఏరియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నది.