హాస్టల్లో వసతుల్లేవ్‌..

– రోడ్డెక్కిన మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు
నవతెలంగాణ- మల్లాపూర్‌
తమకు కనీస మౌలిక వసతులు లేవని జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థి నులు రోడ్డెక్కారు. వర్షాకాలం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పాఠశాలలో కనీసం దగ్గు, జలుబు, జ్వరానికి కూడా మందులు అందుబాటులో లేవని వాపో య్యారు. పాఠశాలలో కేర్‌ టేకర్‌, ఏఎన్‌ఎంలు లేరని ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎవరికి చెప్పు కోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా వార్డెన్‌ సెలవు పెట్టి వెళ్లారని, రాత్రి వేళ భయంతో బిక్కబిక్కుమంటూ గడుపుతున్నామని చెప్పారు. సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇస్తే తప్ప ధర్నా విరిమింపజేసేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ అలీముద్దీన్‌ విద్యార్థినులతో మాట్లాడారు. తాము అనుభవిస్తున్న బాధలు చెప్పలేనివి అని, ఎవరికి చెప్పుకున్నా తీర్చేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ ఘటనా స్థలానికి వచ్చి విద్యార్థి నులతో మాట్లాడారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్క రిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.