ఇన్‌సైడ్‌ జరిగిన విషయాలతో వ్యూహం

ఇన్‌సైడ్‌ జరిగిన విషయాలతో వ్యూహంఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌లో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించారు. ఇందులో వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్‌ నటించగా, వైఎస్‌ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ యూ సర్టిఫికెట్‌తో ఈ నెల 29న గ్రాండ్‌గా థియేటర్స్‌ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌2ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్‌జీవీ మాట్లాడుతూ, ‘సెన్సార్‌ అడ్డంకులతో మా సినిమా ఆగిపోయినప్పుడే చెప్పాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే..మా సినిమా థియేటర్స్‌లోకి రావడాన్నీ అడ్డుకోలేరని. ఇవాళ అదే జరిగింది. అందుకే ఫస్ట్‌ టైమ్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌తో పోస్టర్‌ డిజైన్‌ చేయించాం. ఈ నెల 29న గ్రాండ్‌గా సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. ఇందులో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ పాత్రలను పోలిన క్యారెక్టర్స్‌ ఉంటాయి. అయితే వాటికి చంద్రబాబు, పవన్‌ రియల్‌ లైఫ్‌కు సంబంధం లేదు. ఈ కథలో వైఎస్‌ రాజ శేఖర్‌ రెడ్డి మరణం నుండి మొదలై జగన్‌ అరెస్ట్‌, ఆయన పార్టీ పెట్టి సీఎం అవడం, వైఎస్‌ వివేక హత్య వంటి అనేక ముఖ్య సంఘటనలు ఉంటాయి. సినిమా అంటే డ్రామా కాబట్టి ఆ ఘటనలన్నీ డ్రమటిక్‌గా సినిమా చూసే ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాను. ఈ కథలోని అంశాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్‌సైడ్‌ జరిగిన విషయాలు. అలాంటి అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. ‘వ్యూహం’లో మీకున్న డౌట్స్‌ నా రాబోయే ‘శపథం’ సినిమా చూస్తే క్లియర్‌ అవుతాయి’ అని తెలిపారు. ‘దేవుడు కొందరితో కొన్ని పనులను లోక కల్యాణం కోసం చేయిస్తుంటాడు. అలా నాతో ఈ సినిమా చేయించాడు అని భావిస్తున్నా. ‘వంగవీటి’ తర్వాత నేను వర్మతో చేస్తున్న సినిమా ఇది. మా సినిమాని ఎక్కువ సంఖ్యలోనే థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తాం’ అని నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ అన్నారు.