– వారి వివరాలు ఇచ్చినవారికి రూ.3 లక్షలు రివార్డు
– ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సాగు తున్న ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థు లను మోసపుచ్చే రీతిలో తప్పుడు సమాచారం ఇచ్చేవారిపై కఠిన చర్య లు తీసుకుంటామనీ, అలాగే ఇలాంటి వారికి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి రూ. 3 లక్షల మేరకు నగదు రివార్డును కూడా ఇస్తామని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మెన్ వి.వి శ్రీనివాస్‌రావు శనివారం ప్రకటించారు. కచ్చితమైన నిబంధనల మేరకు పారదర్శకంగా ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల నియామక ప్రక్రియను జరుపుతున్నామనీ, అది తుది దశకు చేరుకున్నదని ఆయన తెలిపారు. తుది పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ 26 తేదీ నాటికి పూర్తయిందని ఆయన చెప్పారు. 97,175 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశామని అన్నారు. అయితే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోని అభ్యర్థులను పక్కనబెట్టామనీ, ఇందులో విద్యార్హతలు సరిగ్గా లేనివారు, నిర్ణీత వయోపరిమితి కంటే తక్కువ, ఎక్కువ పేర్కొన్నవారున్నారని తెలిపారు. నియామక నోటిఫికేషన్ జారీ చేసే సమయంలోనే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వయోపరిమితితో పాటు ఇతర నిబంధనలను కచ్చితంగా పేర్కొనడమేగాక వాటికి సంబంధించిన పూర్తి వివరాలను పెట్టామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, దరఖాస్తు చేసుకునే సమ యంలో ఏదైనా వివరాలను మొదట్లో తప్పుగా పేర్కొన్నవారికి వాటిని సరి చేసుకోవడానికి కూడా తుది రాతపరీక్ష అనంతరం అవకాశం ఇవ్వడం జరి గిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, కొందరు కావాలని ఈ నియా మక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులను మోసపుచ్చే రీతిలో తప్పుదోవ పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటివారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఈ విధంగా మోసపూరితంగా వ్యవహరించేవారి సమాచారాన్ని అందించినవారికి రూ.3 లక్షల మేరకు నగదు రివార్డును ఇస్తామని, అలాగే వారి వివరాలనూ అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని 9393711110కు కూడా సమాచారాన్ని అందజేయొచ్చని ఆయన తెలిపారు.