– ఖమ్మం మిర్చి మార్కెట్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక త్రీ టౌన్ ప్రాంతంలోని వ్యవసాయ మిర్చి మార్కెట్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ సందర్శించారు. మిర్చి కొనుగోళ్ళను తనిఖీ చేశారు. మిర్చి కొనుగోలు విషయమై రైతులను ట్రేడర్లు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిర్చి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మేర దిగుబడి వచ్చింది, ఎంత ధర వస్తుంది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నాణ్యమైన మిర్చికి ధర తగ్గిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్ సంచాలకులు, ఉన్నతాధికారులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కి వచ్చి మిర్చి ధర విషయమై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత మేరకు ధర రావడం లేదని ఆరోపణలు వస్తున్నట్లు, ఈ విషయమై ముగ్గురు వ్యవసాయ అధికారులు, తాల్, వైరస్, నాణ్యత ప్రమాణాల పరీక్షకు ఉద్యానవన శాఖ నుండి సాంకేతికున్ని వ్యవసాయ మార్కెట్‌లో నియమించినట్లు, వీరు మార్కెట్‌లో రైతులకు పూర్తి సమయం అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, పిడి ఎంఐపి రమణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లేశం, మార్కెట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.