– సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య
– నాల్గవ రోజుకు చేరుకున్న జీపీ కార్మికుల సమ్మె
నవతెలంగాణ-ఆమనగల్
దశాబ్దాల కాలంగా వెట్టిచాకిరి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీపీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె నాల్గవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని సోమవారం సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య సందర్శించి మాట్లాడారు. జీపీ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేసి ప్రత్యేక బడ్జెట్ ద్వారా నెల నెల వేతనాలను వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. జీఓ నెంబర్ 51ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీ విధానాన్ని అమలు చేయాలన్నారు. పీఎఫ్ ఈఎస్‌ఐ గ్రాట్యుటీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కార్మికులందరికీ రూ.10 లక్షలకు తగ్గకుండా ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను ఉధతం చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేస్తామని కురుమయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కో కన్వీనర్ ఆశిర్వాదం, మండల కమిటీ సభ్యులు దశరథం, పరమేష్, అంజమ్మ, బాగ్యమ్మ, నరేష్, లక్ష్మమ్మ, చెన్నయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.