పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి

నవతెలంగాణ-శంకర్‌పల్లి
పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) చేవెళ్ల డివిజన్‌ కన్వీనర్‌ అల్లి దేవేందర్‌, మండల కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్పల్లి పట్టణ కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ ప్రియాంకకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో అనేక మంది నిరుపేదలు కొన్నేండ్లుగా నివాసం ఉంటున్నారనీ, వారికి ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డ్‌, ఓటు హక్కు ఉన్నప్పటికీ పాలకులు మాత్రం వారిని పట్టించుకోవడం లేదన్నారు. వారంతా పూరి గుడిసెలల్లో నివసిస్తున్నా, కనీసం వారికి ఇల్లు, ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. లేనియేడలా గుడిసెల పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు. చేవెళ్ల నియోజకవర్గంలో అనేక బంజారా, సికం, మిగులు భూములను అధికార పార్టీ నాయకులు బడా కార్పొరేట్లు కుమ్మక్కై కబ్జాలు చేస్తున్నా, జిల్లా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడంలేదన్నారు. కానీ పేదవారికి వంద గజాలలో గుడిసె వేసుకుంటే మాత్రం వెంటనే స్పందించి కేసులు పెట్టి, జైలుకు పంపుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) అరెస్టులకు జైళ్లకు భయపడకుండా పేదల పక్షాన పోరాటం చేస్తుందని పేదల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శంకర్పల్లి మండల నాయకులు నరసింహ, సురేష్‌, కుమ్మరి సత్యం, మహిళా నాయకురాలు పద్మ, రాధా, అయేషా బేగం, సుజాత, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.