ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య

In RGUKT Student suicide– హైదరాబాద్‌ ఐఐటీలో మరో విద్యార్థిని..
– మానసిక ఒత్తిడితోనే..
నవ తెలంగాణ- బాసర/మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఆర్జీయూకేటీ, ఐఐటీహెచ్‌లో మంగళవారం జరిగాయి. ఈ రెండు క్యాంపస్‌ల్లో మూడు నెలల్లో సుమారు పది మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అసలు యూనివర్సిటీల్లో ఏం జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా బాసర అర్జీయూకేటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. పీయూసీ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభానికి ముందే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్‌ బబ్లూ(15) హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. గమనించిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అంబులెన్స్‌లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నిర్మల్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడ వైద్యులు పరీక్షించి విద్యార్థి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. తరగతులు ప్రారంభం కాకముందే విద్యార్థి మానసిక ఒత్తిడికి గురైనట్టు యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది అవగాహన తరగతుల్లో విద్యార్థి జాదవ్‌ బబ్లూ పాలుపంచుకున్నాడు. యూనివర్సిటీలో చదువుతున్న తన అన్నతో మధ్యాహ్నం వరకు మాట్లాడినట్టు సమాచారం. అంతలోనే విద్యార్థి సూసైడ్‌ చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతి విషయమై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కాగా, నిర్మల్‌ ఆస్పత్రి వద్ద విద్యార్థి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు శ్రీహరిరావును పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కలెక్టర్‌ వచ్చేవరకు కదిలేది లేదని అక్కడే కూర్చున్నారు.సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్‌లో చదువుతున్న విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఐఐటీలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఒడిశాకి చెందిన విద్యార్థిని మమితానాయక్‌(21) సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌నాయక్‌ తెలిపారు. సూసైడ్‌నోట్‌లో విద్యార్థి ఏం రాసిందనే విషయాల్ని మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, జూన్‌ నెలలో కార్తీక్‌ అనే విద్యార్థి ఐఐటీహెచ్‌ నుండి బయటికెళ్లి విశాఖ బీచ్‌లో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు. తాజాగా మరో విద్యార్థిని క్యాంపస్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. చదువుల్లో రాణించలేకపోతున్నామనే ఆత్మన్యూన్యతాభావంతోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గతంలో జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మీడియాకు వెల్లడించారు.