పక్కా ప్రణాళికతోనే సివిల్స్‌లో విజయం

– వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్‌ అదనపు కమిషనర్‌ వై సత్యనారాయణ
– ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమిలో అవగాహన సదస్సు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కృషి, పట్టుదల, సిలబస్‌పైన పూర్తి అవగాహన ఉండి అందుకు తగిన కార్యాచరణ పక్కా ప్రణాళిక ఉంటే సివిల్‌ సర్వీసెస్‌, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అత్యంత సులభమని వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్‌ అదనపు కమిషనర్‌ వై సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉన్న ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమి ఆధ్వర్యంలో ‘సివిల్‌ సర్వీసెస్‌, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా’ అనే అంశంపై సోమవారం ఉచిత అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పోటీ పరీక్షల గురించి వివరించారు. ముఖ్యంగా సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధించాలంటే అందుకు తగిన కృషి, పట్టుదల, సిలబస్‌పై పూర్తి అవగాహనతోపాటు తగిన కార్యాచరణ ప్రణాళిక అభ్యర్థుల్లో ఉండాలని సూచించారు. మంచి మెంటార్‌షిప్‌ కూడా అవసరమని కోరారు. అందుకు తగిన కోచింగ్‌ సెంటర్‌ను అభ్యర్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. మహనీయుల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. అది పెరిగినప్పుడు మాత్రమే సమాజంలో వస్తున్నటువంటి అనేక రుగ్మతలకు సమాధానాలు దొరుకుతాయన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమి పరిపాలన అధికారి కోట సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇది లాభార్జన కోసం ఏర్పడిన సంస్థ కాదన్నారు. ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వారు ఐఏఎస్‌ అధికారులుగా రాణిస్తున్నారని, అందుకు సత్యనారాయణ, ఫ్యాకల్టీ బృందం చేస్తున్న కృషి అమోఘమని వివరించారు. సివిల్‌ సర్వీసెస్‌ అంటే అందరి విద్య, అందని ద్రాక్ష మాత్రం కాదని, ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని ఎస్‌ఆర్‌ శంకరన్‌ నిరూపిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమి ప్రిన్సిపాల్‌ కె సురేందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్‌ జనార్దన్‌ దండు తదితరులు పాల్గొన్నారు.