ఎన్నికల బాండ్లపై 31న సుప్రీం తుది విచారణ

Supreme final hearing on election bonds on 31stన్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 31న తుది విచారణ జరుపుతుంది. పిటిషన్లపై 31న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం తెలిపింది. ద్రవ్య బిల్లుగా ఆమోదం పొందిన 2017వ సంవత్సరపు ఫైనాన్స్‌ చట్టాన్ని సవాలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ ప్రధాన పిటిషన్‌ దాఖలు చేసింది. రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా కంపెనీలు ఎన్నికల నిధులు అందించేందుకు వీలుగా మోడీ ప్రభుత్వం ఎలక్టొరల్‌ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఏదైనా కంపెనీ తన మూడు సంవత్సరాల సగటు నికర లాభంలో 7.5% వరకూ రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చునంటూ గతంలో విధించిన పరిమితిని కూడా ఈ చట్టం తొలగించింది.
పిటిషనర్ల అభ్యంతరాలు
ఎన్నికల బాండ్ల పథకం ప్రకారం ఏదైనా కంపెనీ తాను విరాళాన్ని అందించే రాజకీయ పార్టీ పేరును బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. విరాళాలు అందించే వ్యక్తుల పేర్లు కూడా బయటపెట్టరు. దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట సవరణల్లో పారదర్శకత లోపించిందని, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందని, నల్లధనం, అవినీతి పెరుగుతాయని వారు వాదించారు. షెల్‌ కంపెనీలు పుట్టుకొస్తాయని, లెక్కాపత్రం లేని సొమ్ము బినామీ లావాదేవీల ద్వారా దేశ రాజకీయ, ఎన్నికల ప్రక్రియలోకి చేరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశాంత్‌ భూషణ్‌ ఏమన్నారు?
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ మంగళవారం వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై న్యాయస్థానం 2017 నుండి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనివల్ల అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ లబ్ది పొందుతోందని ఆరోపించారు. ఆ పథకాన్ని మోసపూరితంగా ద్రవ్య బిల్లు రూపంలో చట్టసభలో ప్రవేశపెట్టారని, ఇది గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు పార్టీలకు విరాళాలు అందించడాన్ని చట్టబద్ధం చేస్తోందని ఆయన వాదించారు. రాజకీయ పార్టీలకు అందే నిధులకు సంబంధించిన వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా పొందే అవకాశం లేకుండా పోతోందని, ఇది కచ్చితంగా ప్రజల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, పైగా అవినీతి పెచ్చుమీరే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ‘రాజకీయ పార్టీల నుండి ఏవో ప్రయోజనాలను పొందే కంపెనీలు అందుకు ప్రతిఫలంగా వాటికి విరాళాలు అందిస్తుంటాయి. అవినీతి రహిత సమాజం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 చెబుతోంది. కాబట్టి నిధులు ఎవరు అందజేశారనే విషయాన్ని గోప్యంగా ఉంచకూడదు’ అని ఆయన అన్నారు. నవంబరులో ఐదు రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని నిలిపివేయాల్సిన అవసరం లేదని, అయితే వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందే దీనిపై విచారించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ద్రవ్య బిల్లుతో ముడి పెట్టకుండా…
ఎలక్టొరల్‌ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముందు ద్రవ్య బిల్లు అంశాన్ని తేల్చాలని పిటిషనర్లు కోరుతున్నారా అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ప్రశ్నించగా ద్రవ్య బిల్లు అంశంపై విచారణ జరుపుతూనే బాండ్లపై దాఖలైన పిటిషన్లను విచారించవచ్చునని ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. మరో న్యాయవాది షాదాన్‌ ఫరాసత్‌ తన వాదనలు వినిపిస్తూ విరాళం అందించే వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచినప్పటికీ విరాళం ఎంత ఇచ్చిందీ వెల్లడించేందుకు ఆంక్షలేవీ లేవని చెప్పారు. కంపెనీలు తాము అందించే విరాళాలను వాటాదారులకు తెలియజేస్తాయని, అయితే అవి ఏ పార్టీకి అందాయో వారికి తెలియదని అన్నారు. చట్ట ప్రకారం ఎన్నికల బాండ్ల పథకాన్ని ద్రవ్య బిల్లుగా సభలో ప్రవేశపెట్టకూడదని చెప్పారు. బాండ్ల పథకాన్ని ద్రవ్య బిల్లుగా ప్రవేశపెట్టడం సబబేనని న్యాయస్థానం అభిప్రాయపడితే ఈ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇది ద్రవ్య బిల్లు కాదన్న కారణం చూపి బాండ్ల పథకాన్ని పిటిషనర్లు సవాలు చేయకుండా ఉంటేనే విచారణ ముందుకు సాగుతుందని చెప్పారు. ద్రవ్య బిల్లు వ్యవహారంపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ సంవత్సరంలోనే తీర్పు ఇస్తుందా లేదా అనే విషయాన్ని తాను చెప్పలేనని తెలిపారు. దీనిపై ప్రశాంత్‌ భూషణ్‌, ఇతర న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ ద్రవ్య బిల్లు వ్యవహారంలోకి పోకుండా బాండ్ల పథకం పైనే వాదనలు వినిపించేందుకు అంగీకారం తెలిపారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని ఈ నెల 28 నాటికి లిఖితపూర్వకంగా అందజేయాలని అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణికి న్యాయస్థానం సూచించింది.
ఏమిటీ పథకం ?
ఎన్నికల బాండ్ల పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018 జనవరిలో ప్రవేశపెట్టింది. పౌరులు కానీ, కంపెనీలు కానీ వీటిని బ్యాంకు నుండి కొనుగోలు చేసి రాజకీయ పార్టీకి ఇవ్వవచ్చు. ఆ పార్టీ సదరు మొత్తాన్ని నగదు రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ద్రవ్య బిల్లు రూపంలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ద్రవ్య బిల్లులకు రాజ్యసభ ఆమోదం అవసరం లేదు. ఈ పథకంపై ఎన్నికల కమిషన్‌, రిజర్వ్‌బ్యాంక్‌ సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎన్నికల బాండ్లు విక్రయించే బాధ్యతను ఎస్‌బీఐకి అప్పగించింది. బ్యాంకు వద్ద పది వేల రూపాయల నుండి కోటి రూపాయల విలువ కలిగిన బాండ్లు లభిస్తాయి. వీటిని నగదు చెల్లించడం ద్వారా లేదా నగదును బదిలీ చేయడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. నగదు రూపంలో డిపాజిట్‌ చేయాలంటే ఖాతా తెరవాల్సి ఉంటుంది. బాండ్లను ఎవరు కొనుగోలు చేసిందీ ఒక్క ఎస్‌బీఐకి మాత్రమే తెలుస్తుంది. అయితే బ్యాంకు ఆ వివరాలు బయటపెట్టకూడదు. ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచరు. 2017లో చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ పథకాన్ని ప్రకటించారు. రాజకీయ విరాళాల ప్రక్రియను ప్రక్షాళన చేసి, పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిం దని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారం మొత్తం గోప్యంగా ఉండడంతో అనుమానాలకు తావిస్తోంది. వడ్డీ లేని బాండ్లను కొనుగోలు చేశామని ఎవరూ ప్రకటించాల్సిన అవసరం లేదు. సొమ్ము ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాల్సిన అవసరం రాజకీయ పార్టీలకూ లేదు.