బహుముఖ వైతాళిక ప్రతాపుడు సురవరం

– రచనలు చైతన్య దీపికలు
– ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా 127వ జయంతి
నవతెలంగాణ-ఇల్లందు
తెలంగాణ రాజకీయాలకు తొలితరం దిక్సూచిగా నిలిచి, ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని రగిలించిన బహుముఖ వైతాళిక ప్రతాపుడు సురవరం ప్రతాపరెడ్డి అని ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్‌ హరిప్రియా నాయక్‌, గ్రంథాలయ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ అన్నారు. సురవరం 127వ జయంతిని పురస్కరించుకొని స్థానిక శాఖ గ్రంథాలయం ఇల్లందు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సురవరం బహుభాషా కోవిందుడు అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన సంపాదకుడిగా రచయితగా ప్రేరకునిగా, క్రియాశీల ఉద్యమ కారునిగా చేసిన కృషి అనిర్వచనీయం అన్నారు. తెలంగాణలో కవులే లేరని పలువురు వేసిన నిందను తొలగించేందుకు 354 మంది కవులతో గోల్కొండ కవుల సంచికను ప్రచురించి తనదైన శైలిలో సమాధానమిచ్చిన మేధోసంపన్నుడని చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, ఫారసీ, భాషలో ప్రావీణ్యం ఉన్న ఆయన గోల్కొండ, భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను నెలకొల్పారని చెప్పారు. ఆనాటి నైజాం నిరంకు పాలనను ఎండగడుతూ తెలుగు వారి అనిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారిని చైతన్య వంతులుగా తీర్చిదిద్దేందుకు ఎనలేని కృషి చేశారని చెప్పారు. రాజకీయాల్లో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నికయ్యారని చెప్పారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ పై శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, 1955లో రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా దక్కింది అన్నారు. ఇంత గొప్ప మేధావి, వైతాళికుడు అయిన సురవరం ప్రతాపరెడ్డి మన తెలంగాణ వాడు కావడం మనం చేసుకున్న అదృష్టం అని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ జాతి జాగృతికి కృషి చేద్దామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పులిగళ్ల మాధవ రావు, డేరంగుల పోషం, అజ్మీరా బావసింగ్‌, పాలడుగు శేఖర్‌ రాచపల్లి శ్రీనివాస్‌, ముత్తయ్య, శ్రీనివాస రెడ్డి, గినారపు మహేందర్‌, మునిగంటి శివ, గ్రంధాలయం పాలకురాలు రుక్మిణి తదితరులు పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు.