– వదంతులు వ్యాప్తి చేస్తే బహిష్కరిస్తాం : మసీదు కమిటీ
వారణాసి : ఇక్కడి జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) అధికారులు మూడోరోజైన ఆదివారం సర్వే కొనసాగించారు. 17వ శతాబ్దపు మసీదు ముందుగా నిర్మించారా? లేక అంతకుముందున్న నిర్మాణంపై మసీదును నిర్మించారా? అనే అంశం నిర్దారించేందుకు జ్ఞానవాపి మసీదు వద్ద సర్వే నిర్వహించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సర్వే కొనసాగిందని ప్రభుత్వ న్యాయవాది రాజేష్ మిశ్రా తెలిపారు. ఈ నెల 4న బేస్‌మెంట్ సర్వేలో విగ్రహాలు, త్రిశూలం, కలశం లభ్యమయ్యాయని ఓ వర్గం మీడియా శనివారం పుకార్లు వ్యాపింపజేసిందని మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతే జామియా కమిటీ జాయింట సెక్రటరీ సయ్యద్ మహ్మద్ యాసిన్ తెలిపారు. ఇలాంటి వదంతులకు అడ్డుకట్ట వేయకపోతే సర్వే పనులను బహిష్కరిస్తామని చెప్పారు. జ్ఞాన్‌వాపి మసీదులో ఎఎస్‌ఐ సర్వేపై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించిన సంగతి తెలిసిందే. సర్వే సమయంలో ఎలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడవద్దని ఎఎస్‌ఐని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కోరింది.