– తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న కక్షతో జనరల్ మేనేజర్‌పై కాల్పులు
– వివరాలను వెల్లడించిన మాదాపూర్ డీసీపీ సందీప్
నవతెలంగాణ-మియాపూర్
తనను ఉద్యోగం నుంచి తీసేశారనే కోపంతో మేనేజర్‌పై కాల్పులు జరపడంతో ఆయన మృతిచెందారు. నిందితున్ని మియాపూర్, మాదాపూర్ ఎస్ఓటీ టీం ఎనిమిది గంటల్లోనే అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సందీప్ మీడియాకు వెల్లడించారు. మియాపూర్‌లోని మదినాగూడ సందర్శిని ఎలైట్ హౌటల్లో జనరల్ మేనేజర్‌గా దేవేందర్(36), మేనేజర్‌గా రతీష్నాయర్ పనిచేస్తున్నారు. దేవేందర్, రాతేష్నాయక్ మధ్య పలుమార్లు చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రతీష్నాయర్ను దేవేందర్ ఉద్యోగం నుంచి తీయించాడు. తన ఉద్యోగం పోవడంతో దేవేందర్‌పై రతిష్నాయర్ కక్ష పెంచుకున్నాడు. ఆయనపై కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనతో బీహార్‌కు వెళ్లి ఒక చిన్నపాటి తుపాకీ కొనుగోలు చేశాడు. నెల రోజులపాటు దేవేందర్ కదలికలపై నిఘా వేశాడు.
కాగా, బుధవారం రాత్రి పది గంటల సమయంలో విధులు ముగించుకుని హౌటల్ నుంచి బయటికి వచ్చిన దేవేందర్‌పై రతీష్నాయక్ ఆరు రౌండ్ల కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ను స్థానికులు, హౌటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దేవేందర్ మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడి కోసం పోలీసులు.. ఆరు బృందాలు ఏర్పాటు చేసి గాలించగా.. గురువారం ఉదయం 6 గంటల సమయంలో నిందితుడు రతీష్నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఉద్యోగం తీయించాడన్న కక్షతోనే అతనిపై నిందితుడు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో నిందితుడు వెల్లడించినట్టు డీసీపీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. తక్కువ సమయంలో నిందితుడిని పట్టుకున్న మియాపూర్, మాదాపూర్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.