మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికపై తీర్పు చెప్పిన జడ్జి సస్పెన్షన్‌

– ఈసీ ఫిర్యాదుపై హైకోర్టు పరిపాలనా ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌ను ట్యాంపరింగ్‌ చేశారంటూ ఇటీవల తీర్పు చెప్పిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టు జడ్జి కె.జయకుమార్‌పై హైకోర్టు సస్పెండ్‌ వేటు వేసింది. ఎలక్షన్‌ అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్‌ ట్యాంపరింగ్‌ చేసేందుకు సహకరించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానఅధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇతర అధికారులపై కేసు పెట్టాలన్న ఉత్తర్వులు జారీ చేయడం జడ్జి తన పరిధిని అతిక్రమించడమేనని హైకోర్టు మంగళవారం నిర్ధారణకు వచ్చింది. శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన చలువగాలి రాఘవేంద్రరాజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని ఆ కోర్టు జడ్జి జయకుమార్‌ విచారించి గత నెల 31న ఉత్తర్వులు వెలువరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌పై కూడా కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించారు. సీఈసీతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, 2018లో మహబూబ్‌నగర్‌లో ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్‌ అధికారులు, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సహా 10 మందిపై కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా జడ్జి తన పరిధిని అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం, హైకోర్టుకు పరిపాలనాపరమైన ఫిర్యాదు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో మార్పులు చేర్పులకు లేదా ట్యాంపరింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ప్రజాప్రతినిధుల కోర్టు తన పరిధిని దాటి ఉత్తర్వులు జారీ చేసిందని, కింది కోర్టు జడ్జిలపై పాలనాపరమైన నియంత్రణ అధికారం హైకోర్టుకే ఉండటంతో పరిపాలనా అంశంగా తమ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఆ ఫిర్యాదుపై హైకోర్టు పరిపాలనా అంశంగా పరిశీలించి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి పరిధి దాటినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. నాంపల్లి కోర్టు జడ్జి కె.జయకుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రమశిక్షణాచర్యలు పెండింగ్‌లో ఉండగా జడ్జి పదవిలో కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. జడ్జి పదవిలో కొనసాగితే కేసు విచారణ నిస్పక్షపాతంగా జరగదని, సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయాల్సివచ్చిందని వివరించింది. విచారణ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు హైకోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచివెళ్లకూడదని జడ్జికి షరతు విధించింది.
తొలుత జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత మహబూబ్‌నగర్‌ పోలీసులు మంత్రి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సహా ఇతరులపై కేసు నమోదు చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు రాఘవేంద్రరాజు మరోసారి ప్రజాప్రతినిధుల కోర్టు దష్టికి తెచ్చారు. దీనిపై ఈ నెల 12న మరోసారి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపి, కేసు నమోదు చేయాలన్న తమ ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో సాయంత్రం 4 గంటలలోపు చెప్పాలని జడ్జి మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు వారందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసులు పెట్టాలన్న అధికారుల జాబితాలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉండటంతో ఈసీ హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో జడ్జి సస్పెన్షన్‌ వేటు పరిణామం చోటు చేసుకుంది.
మరోవైపు కేసు నమోదు చేయాలని దిగువ కోర్టు ఆదేశాలు జారీచేసిన జూలై 31వ తేదీనే ఇదే అంశంపై హైకోర్టులోని ఎలక్షన్‌ పిటిషన్‌ కూడా విచారణకు వచ్చింది. శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌ను విచారించిన సందర్భంగా, ఎన్నికల అఫిడవిట్‌ను మార్పు చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకసారి సమర్పించిన అఫిడవిట్‌ను నామినేషన్‌ గడువు ముగిసేలోగా మార్పు చేసుకుంటే తప్పులేదని చెప్పింది. అదేరోజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు, అఫిడవిట్‌ మార్పు చేయడాన్ని తప్పుపడుతూ సంబంధిత అధికారులు, మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అమలు కాలేదనే అంశంపై అదే తరహా ఉత్తర్వులను ఈ నెల తిరిగి జారీ చేసింది. దీంతో మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో హైకోర్టుకు ఈసీ ఫిర్యాదు సమర్పించింది. దీంతో జడ్జిని హైకోర్టు సస్పెండ్‌ చేసింది.
హైకోర్టు రిజిస్ట్రార్‌ విచారణ
నాంపల్లి కోర్జు జడ్జి మౌఖికంగా జారీ చేసిన ఆదేశాల తర్వాత మహబూబ్‌నగర్‌ పోలీసులు ఈసీ అధికారులతోపాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మ రాష్ట్ర హైకోర్టుకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ విచారణ చేపట్టి హైకోర్టు పరిపాలనా అధిపతి అయిన ప్రధాన న్యాయమూర్తికి నివేదిక సమర్పించారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 200 ప్రకారం రాఘవేంద్రరాజు ఫిర్యాదు తర్వాత నాంపల్లి కోర్టు జడ్జి ప్రాథమిక విచారణ చేయకుండా, వాంగ్మూలాన్ని నమోదు చేయకుండానే సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 15(3) కింద దర్యాప్తు చేయాలని పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చారని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో జడ్జిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం నిర్ణయించింది.
ప్రజాప్రయోజనాల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల కారణంగా తీసుకున్న సస్పెన్షన్‌ నిర్ణయం తర్వాత జడ్జిగా జయకుమార్‌ కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలంది. అనుమతి లేకుండా హైదరాబాద్‌ విడిచివెళ్లరాదని ఆదేశించింది. విచారణ పూర్తి అయ్యే వరకు ఈ షరతులు వర్తిస్తాయని చెప్పింది. తక్షణ మే బాధ్యతలను మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జికి అప్పగించాలంది. బాధ్యతలు స్వీకరించే 15 ఆదనపు చీఫ్‌ జడ్జి (సిటీ సివిల్‌ కోర్టు) ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టు జడ్జిగా కొనసాగుతారని పేర్కొంది.