ఆర్టీసీ కార్మికులకు వెంటనే వేతన సవరణ చేయాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌ డిమాండ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామనీ, ఈలోపు ఐఆర్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటన చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ స్వాగతించింది. అయితే ఆర్టీసీ కార్మికులకు 2017, 2021 సంవత్సరాల్లో రావలసిన వేతన సవరణ జరగలేదనీ, దీనితో కార్మికులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొంది. తక్షణం ఆ రెండు వేతన ఒప్పందాలు చేయాలని ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు వేతన ఒప్పందాలు జరక్కుండా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు రావని వారు అభిప్రాయపడ్డారు. వేతనసవరణతో పాటు ఏడేండ్ల పాతబకాయిలు కూడా చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కంటే ముందు 8 సమస్యలు, విలీన ప్రక్రియలో వచ్చే 11 అంశాలు సహా మొత్తం 72 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్ధికశాఖ)కి ఇచ్చామనీ, వాటికి పరిష్కారాలు చూపాలని కోరారు. విలీన ప్రక్రియలో రిజిస్టర్డ్‌ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.