– ఎలక్షన్ కమిషన్‌కు ఏడీఆర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల నేర చరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఎలక్షన్ కమిషన్‌కు ఏడీఆర్ లేఖరాసింది. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో తమ అభ్యర్థుల నేర చరిత్ర, పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి రాజకీయ పార్టీలు వెల్లడించడం తప్పనిసరి అని ఎడిఆర్ తన లేఖలో గుర్తు చేసింది. అలాగే నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడానికి గల కారణాలను, నేరచరిత్ర లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయలేకపోయారనే విషయాలను కూడా రాజకీయ పార్టీలు వెల్లడించాల్సి ఉంటుందని ఎడిఆర్ తెలిపింది. తన ఆదేశాలను పాటించనందుకు 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించిన విషయాన్ని కూడా ఏడీఆర్ గుర్తుచేసింది.
దీని తరువాత ఈ ఏడాదిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, 2022లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ ఎన్నికలు, 2021లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని ఏడీఆర్ తెలిపింది. ఈ ఎన్నికల్లో నిబంధనలు పాటించని రాజకీయ పార్టీలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.