అక్షరాలే కాదు ఆత్మరక్షణ నేర్పుతూ…


Teaching self defense not just letters...ఆశా సుమన్‌… హిందీ ఉపాధ్యాయురాలు. కానీ పిల్లలకు అక్షరాలు నేర్పిస్తే తన బాధ్యత తీరినట్టు భావించలేదు. అమ్మాయిలకు ఈ సమాజంలో ఎదురౌతున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతున్నారు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. వారికి అవసరమైన ఆత్మరక్షణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది బాలికలకు శిక్షణ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నా ఇదే తన జీవిత లక్ష్యమని చెబుతున్న ఆ స్ఫూర్తిదాయక ఉపాధ్యాయురాలి పరిచయం నేటి మానవిలో… 

ఆశా సుమన్‌ యువతుల కోసం అందిస్తున్న స్వీయ రక్షణ తరగతులు కేవలం బోధించే పాఠాలుగా మాత్రమే కాదు, దీర్ఘకాలంలో వారిలో విశ్వాసాన్ని పెంపొందించే ఆయుధాలుగా కూడా ఉపయోగపడతాయి. 2015లో రాజస్థాన్‌లోని అల్వార్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉన్న ఆశా బాలికలు, యువతులకు ఆత్మరక్షణ నేర్పించే బాధ్యతను స్వీకరించారు. తద్వారా వారు ఆపదలో ఉన్న సమయాల్లో తమను తాము రక్షించుకోగలరు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె రాజస్థాన్‌లో సుమారు 30,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇందులో వినికిడి సమస్య, దృష్టి లోపం ఉన్న బాలికలు 250 మంది ఉన్నారు. అలాగే కొంతమంది వృద్ధ మహిళలు కూడా ఉన్నారు.
స్వీయ రక్షణ తరగతులు 
‘అమ్మాయిలకు వారిని వారు రక్షించుకునే శక్తి ఉండాలి. దాని కోసమే నేను ఈ శిక్షణా తరగతులు ప్రారంభించాను’ అని ఆశా అంటున్నారు. స్థానిక పాఠశాలలో హిందీ బోధించే ఆశా బాలికలకు తైక్వాండో, కరాటేతో పాటు ఇతర మార్షల్‌ ఆర్ట్‌ నేర్పిస్తున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత ఆమె ఈ స్వీయ రక్షణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి సెషన్‌ దాదాపు ఆరు రోజులు ఉంటుంది. ఆమె దేశంలోని 24 రాష్ట్రాలలో దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ కూడా ఇస్తుంది.
ఆ సంఘటనతో… 
2005లో ఆశా తన ఉద్యోగం ప్రారంభించినప్పుడు పాఠశాలలో కేవలం 20 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సరైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేవు. పాఠశాల నుండి సమీప రహదారి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్పంచ్‌ సహకారంతో ఆశా గ్రామంలోని తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యం గురించి వివరించింది. ఆమె ప్రయత్నాలు ఫలించి రెండేండ్లలోనే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120కి చేరుకుంది. ఫలితంగా విద్యాశాఖ 2007లో పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించింది. 2014లో ఆ గ్రామంలో మానసిక వైకల్యం ఉన్న మైనక్‌ బాలికపై పాఠశాల సమీపంలోని పొలంలో నలుగురు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో గ్రామం మొత్తం షాక్‌కి గురయింది. పాఠశాలకు వచ్చే బాలికల సంఖ్య కూడా తగ్గింది. పొలాల నుండి ఒంటరిగా నడుచుకుంటూ పాఠశాలకు రావల్సి వచ్చేది. దాంతో ఆశా భద్రత గురించి ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనతో బాలికల చదువుకు ఆటంకం కలగకూడదనుకున్నారు.
ఆత్మ విశ్వాసం పెరిగింది 
‘ఆమెకు ఆత్మరక్షణ గురించి తెలిస్తే తనను తాను రక్షించుకోగలిగేది. అందుకే నేను వెంటనే అమ్మాయిల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేశాను. చదువు ప్రాముఖ్యతను వారికి వివరించడానికి ప్రయత్నించాను. నేను కూడా నా ద్విచక్ర వాహనంపై వారి ఇళ్లకు అమ్మాయిలకు తోడుగా వెళ్ళేదాన్ని’ అని ఆమె గుర్తుచేసుకుంది. ఆమె ఎంత కృషి చేసినా బాలికలు ఆ సంఘటన నుండి తేరుకుని ఆత్మవిశ్వాసం పొంది తిరిగి పాఠశాలకు రావడానికి రెండు నెలలకు పైగా పట్టింది. ఈ సమయంలోనే ఆశా ఆత్మరక్షణ నేర్చుకోవాలని, పిల్లలకు నేర్పించాలని బలంగా నిర్ణయించుకుంది. 2015లో జైపూర్‌లోని పోలీస్‌ అకాడమీలో ఆత్మరక్షణ కోర్సుకు హాజరైంది. ‘కోర్సు పూర్తి చేసిన తర్వాత వెనక్కి తగ్గేది లేదు. ఈ అమ్మాయిలు తమ భద్రతను స్వయంగా నియంత్రించు కునేలా శక్తివంతం చేసేందుకు నేను ఒక ప్రయాణాన్ని ప్రారంభించాను’ అని ఆమె చెప్పింది. సాధారణ అమ్మాయిలకే కాకుండా దృష్టిలోపం, మూగ, వినికిడి లోపం ఉన్న అమ్మాయి లకు కూడా ఆత్మరక్షణ ఎలా నేర్పించాలో ముంబైలోని కంబాట్‌ టాక్టికల్‌ అసోసియేషన్‌లో ఆమె శిక్షణ పొందింది.
తాను శిక్షణ తీసుకుని… 
ఆశా ప్రత్యేక సామర్థ్యం ఉన్న అమ్మాయిలకు కూడా అటాక్‌ పొజిషన్‌లను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఎవరైనా తమను అనుసరిస్తున్నారో లేదో అర్థం చేసుకోవడానికి ఆమె డమ్మీని కూడా ఉపయోగిస్తుంది. అమ్మాయిలకు శిక్షణ ఇవ్వడానికి ఆమె అనేక రకాల సాంకేతికత నైపుణ్యాలను వాడుకుంటుంది. అటాకర్‌ను వంగి మోచేతితో కొట్టడం, కిక్‌లతో కొట్టడం వంటివి నేర్పుతుంది. గత ఏడాది ఆశా వద్ద స్వీయ రక్షణ శిక్షణ పొందిన దృష్టి లోపం ఉన్న మోనికా మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుండి నేను ఎక్కడికి వెళ్లినా నా తల్లిదండ్రులు నాతో పాటు ఉండేవారు. నా భద్రత గురించి అందరూ భయపడుతుంటారు. అయితే సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒంటరిగా సమీపంలోని ప్రదేశాలకు వెళ్లగలను. నన్ను నేను రక్షించుకోగలననే విశ్వాసం నాలో ఉంది’ అని ఆమె చెప్పింది. ఆశా స్వీయ రక్షణపై ఉచిత వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి పాఠశాలలు, కళాశాలలు, గ్రామ ప్రజలు కూడా సహకరిస్తుంది. ‘అమ్మాయిలు శారీరకంగా బలహీనంగా ఉన్నామని అనుకుంటారు. ఆ భావనతోనే వారు పురుషులతో పోరాడలేరు. అందుకే వారు తమను తాము రక్షించుకునేలా తగినంత శిక్షణ ఇవ్వడమే నా జీవిత లక్ష్యం. ఎక్కడ ఉన్నా అమ్మాయిలకు శిక్షణ ఇస్తూ వారిని స్వయం సమృద్ధిగా చేస్తాను’ అంటూ ఆమె తన మాటలు ముగించింది.
దృఢంగా తయారు చేయాలి
ఆత్మరక్షణ శిక్షణ 90 శాతం మానసిక ప్రయత్నమని, కేవలం 10 శాతం మాత్రమే శారీరక శ్రమ అని ఆశా చెబుతుంది. ఒకరి శరీరాన్ని ఆయుధంగా ఉపయోగించు కోవాలనే ఆలోచనను కూడా ఆమె నొక్కి చెప్తుంది. తీవ్రమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, అత్యవసర సమయాల్లో ఎలా సహాయం పొందాలో ఆమె విద్యార్థులకు సూచిస్తూ తన తరగతిని ప్రారంభి స్తుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవాలంటే చర్చలే తొలి అడుగు అని ఆమె అంటుంది. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరకు భౌతిక రక్షణను ఆశ్రయించాలని ఆమె తన విద్యార్థులకు సలహా ఇస్తుంది. ఎదుటి వ్యక్తిని తన్నడం, అడ్డుకోవడం, దాడి చేసే వ్యూహాత్మక పద్ధతుల వంటి నైపుణ్యాలపై బహిరంగ శిక్షణా సెషన్‌లను నిర్వహిస్తుంది. ఆత్మరక్షణ సమయంలో మానవ శరీరంలోని ఏ భాగాలకు హాని కలిగిస్తే భద్రత ఉంటుందో విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. అంతే కాదు మహిళల భద్రత, సంబంధిత హెల్ప్‌లైన్‌లకు సంబంధించిన చట్టాల గురించి కూడా చెబుతుంది.
– సలీమ