– సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్
– ఇన్‌సెంటివ్స్ చెల్లించాలని విజయ డైరీ కార్యాలయం ఎదుట పాడి రైతుల ధర్నా
నవతెలంగాణ-ఓయూ
పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని, వారికి ఇన్‌సెంటివ్స్ చెల్లించాలని తెలంగాణ పాడిరైతుల సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లాలాపేట్‌లోని విజయ డైరీ కార్యాలయం ఎదుట తెలంగాణ పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిదారులు కొందరికి 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల గ్రామాల్లో రైతులు ప్రయివేటు డెయిరీలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. దాంతో విజయ డెయిరీకి వేలాది లీటర్ల పాలు ఇటీవల తగ్గాయని చెప్పారు. పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహంను రూ.7కు పెంచి.. పాల బిల్లుతో చెల్లించాలన్నారు. కర్నాటక, కేరళ తరహాలో సాంకేతిక సేవలు అందించాలని, పాడి పశువుల బీమా ఉచితంగా చేపట్టాలని, పాడి రైతుల ప్రమాదబీమా రూ.10 లక్షలు కల్పించాలని కోరారు. రైతులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని, పాడి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు మూడ్ .శోభన్ మాట్లాడుతూ.. డెయిరీ నుంచి వచ్చే లాభాలను ప్రభుత్వం రైతులకు పంచాలని, డెయిరీకి పర్మినెంట్ ఎండీని నియమించాలని, ఒకే ప్రదేశంలో ఎక్కువ సంవత్సరాల నుంచి పని చేస్తున్న సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని కోరగా కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. దాంతో రైతులు ఎర్రటి ఎండలో నేలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జీఎం మల్లయ్య ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇన్‌సెంటివ్ ప్రాసెస్‌లో ఉందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.