ఏసీబీకి చిక్కిన తెలంగాణ ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ

– తెలంగాణ యూనివర్సిటీ వీసీ
– రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
– అరెస్టు చేసి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో తొలిసారిగా ఒక యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌(వీసీ) భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం కలకలం రేపింది. రూ. 50 వేలను ఒక కాలేజీ చైర్మెన్‌ నుంచి లంచంగా తీసుకుంటుం డగా తార్నాకలోని ఆయన నివాసంలోనే వీసీ రవీందర్‌ గుప్తాను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీజీ డాక్టర్‌ రవి గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. నిజమాబాద్‌ డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గల శ్రీసాయి డిగ్రీ కాలేజీకి ఎగ్జామినేషన్‌ సెంటర్‌ను కేటాయించడానికి గానూ రూ. 50 వేలను సదరు కాలేజీ చైర్మెన్‌ శంకర్‌ నుంచి వీసీ డిమాండ్‌ చేశారు. అందుకు ఆయన అంగీకరించగా.. ఆ డబ్బులను హైదరాబాద్‌ తార్నాకలోని కిమ్మిటీ కాలనీలో గల తన నివాసంలో అందజేయాలని వీసీ కోరాడు. ఆ మేరకు తన నివాసంలో లంచం సొమ్మును శంకర్‌ నుంచి స్వీకరించిన వీసీ.. ఆ డబ్బులను తన బెడ్రూమ్‌లోని అల్మారా లో పెడుతుండగా.. అప్పటికే కాపుగాసిన ఏసీబీ అధికారులు రవీందర్‌ గుప్తాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీరువాలోని లంచం సొమ్మును స్వాధీనపర్చుకొని రవీందర్‌గుప్తాను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడిని తర్వాత హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా రవీందర్‌గుప్తాకు 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దానితో నిందితుడిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ దాడికి నాయకత్వం వహించిన ఏసీబీ అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ తన టీమ్‌తో కలిసి వీసీ నివాసంలో తదుపరి దర్యాప్తులో భాగంగా సోదాలను నిర్వహించారు. ఆ వివరాలను తర్వాత వెల్లడిస్తామనీ, దర్యాప్తు సాగుతున్నదని శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, 2021లో తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమితులైనప్పటి నుంచి పలు వివాదాల్లో రవీందర్‌గుప్తా చిక్కుకున్నారు. ముఖ్యంగా, యూనివర్సిటీ పరిపాలనకు సంబంధించి పలు అక్రమాలకు పాల్పడ్డారనీ, కొందరిని యూనివర్సిటీ ఉద్యోగాల్లో నియమించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారనీ, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌లను తరచుగా మారుస్తూ ఇష్టారాజ్యం చేశారని ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆయనపై పలు ఆరోపణలు చేశాయి.