నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
చోరీకి గురవుతున్న సెల్‌ఫోన్ల రికవరీలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ నుంచి నుంచి మంగళవారం 7వ తేదీ నాటికి చోరులపాలైన సెల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 67.30 శాతం రికవరీ రేటును సాధించగలిగామని ఆయన చెప్పారు. ముఖ్యంగా, భారత టెలీ కమ్యూనికేషన్ల విభాగంతో కలిసి అభివృద్ధి చేసిన సీఐఈఎఫ్ యాప్ ద్వారా చోరులపాలైన సెల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిగల్స్ ద్వారా పసిగట్టటం జరుగుతున్నదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 5030 సెల్‌ఫోన్లను వారి స్వంతదారులకు అప్పగించటం జరిగిందని తెలిపారు. సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు తమ సెల్ ఈఎంఐఈ నెంబర్‌తో సహా స్థానిక పోలీసు స్టేషన్లో గానీ, ఈ-సేవా కేంద్రాల్లోగానీ వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోయిన సెల్‌ఫోన్లను గుర్తించటంలో సాధారణంగా 16 నుంచి 30 రోజులు పడుతున్నదని ఆయన తెలిపారు. కాగా, సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా.. కర్నాటక, ఏపీ రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని అన్నారు. సీఐడీ, స్థానికపోలీసులతో పాటు భారత టెలీకమ్యూనికేషన్ విభాగాలు సంయుక్తంగా చోరులపాలైన సెల్‌ఫోన్ల గుర్తింపులో సంయుక్తంగా దర్యాప్తు జరుపుతూ ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు.