ప్రగతి వైపు తెలంగాణ ప్రభుత్వ విద్య…

– ఎంపీపీ గొంది వాణిశ్రీ
– ఘనంగా విద్య దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ- తాడ్వాయి
ప్రభుత్వ విద్య ప్రగతి వైపు పరిగెడుతుందని ఎంపీపీ గొంది వాణిశ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 20వ రోజున విద్యోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు బుక్స్, నోట్స్, పెన్నులు, పెన్సిళ్లు, దుస్తులు అందజేశారు. మన ఊరు మనబడిని స్థానిక తహసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి అప్పయ్య, విద్యాశాఖ అధికారి సాంబయ్య, మండల అభివృద్ధి అధికారి సత్యాంజనేయ ప్రసాద్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకే ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు కూడా సత్ఫలితాళిస్తున్నాయన్నారు. 2022- 23 విద్య సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. నాణ్యమైన విద్యా విధానం, ఇంగ్లీష్ మీడియం లో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను కెసిఆర్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని, అత్యధిక గురుకుల పాఠశాలలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. పదవ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శాలువాలు కప్పి సన్మానించారు. మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినికి శాలువా కప్పి సన్మానించి, వెయ్యి రూపాయలు బహుకరించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని అందరూ బాగా చదివి కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థి ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సాంబయ్య, హెచ్ఎంలు బాబురావు, సుతారి పాపారావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, గ్రామస్తులు, పేరెంట్స్, విద్యార్థినీ, విద్యార్థులు ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.