క్రీడారంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శం

– సాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ
– ఎల్బీ స్టేడియంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పదేండ్లలో తెలంగాణ క్రీడారంగం అద్భుతమైన విజయాలు సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పోర్స్ట్‌ అథారిటీ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాట్స్‌ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయగౌడ్‌ మాట్లాడుతూ.. క్రీడారంగ రిజర్వేషన్లు, నగదు ప్రోత్సాహకాల పెంపు, క్రీడా మైదానాల నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, తదితర విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రగతి దూసుకుపోతున్న దన్నారు. మన రాష్ట్ర, దేశ గౌరవాన్ని నిలబెట్టేది, కాపాడేది క్రీడాకారులేననీ, క్రీడాకారులు ఆత్మగౌరవాన్నీ కోరుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని జాతి తల ఎత్తుకునేలాగా సమున్నతంగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్‌ ప్రభుత్వానిదే అన్నారు.
సీఎం కప్‌ పోటీల విజయవంతానికి కృషిచేసిన అధికారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడా సంఘాల ప్రతినిధులకు, కోచ్‌లకు, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు, కోచ్‌లు, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు, తదితరులు పాల్గొన్నారు.