కేసీఆర్‌ వల్లే ప్రథమ స్థానంలో తెలంగాణ

మంచినీళ్ల పండగ సంబురాల్లో..మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/విలేకరులు
తెలంగాణను సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపారని మంత్రులు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పలు జిల్లాల్లో జరిగిన మంచినీళ్ల పండుగ సంబురాల్లో మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాని మాట్లాడారు. మిషన్‌ భగీరథ గొప్ప పథకమని, ఇది శతాబ్ద కాలం పాటు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఖాళీ బిందెలు, కుండలు, కాలిపోయిన మోటర్లతో ధర్నాలు జరిగేవని.. ఇప్పుడు ఒక్కసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, ఇది తెలంగాణ సాధించిన విజయమన్నారు.
ఈ పరిస్థితి మారడంలో జలమండలి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో మిషన్‌ భగీరథ ఒక గొప్ప పథకం అన్నారు. ఈ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని విమర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. సుంకిశాలతో నగరానికి, మిషన్‌ భగీరథతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు తాగు నీటికి ఢోకా లేదని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు గోదావరి నీళ్లు అంటే ఎక్కడో ఉండేవని.. ప్రస్తుతం అవి మన ఇండ్లల్లోకే వస్తున్నాయన్నారు. అటు ఓఆర్‌ఆర్‌ రెండు ఫేజుల ప్రాజెక్ట్‌, పైప్‌ లైన్‌ నెట్‌ వర్క్స్‌తో తమ నియోజక వర్గంలో అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మంచినీళ్ల పండగ చేసుకునే నైతిక హక్కు తెలంగాణ ప్రజానీకానికి ఉందని అన్నారు. అనంతరం జలమండలి, మిషన్‌ భగీరథ అధికారుల్ని మంత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ సెక్రటరీ స్మితా సబర్వాల్‌, జలమండలి డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, వాటర్‌ వర్క్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాంబాబు యాదవ్‌, కనీస వేతన సలహా బోర్డు చైర్మెన్‌ నారాయణ, ఇతర ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా మండలం ముచర్ల గ్రామంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. మిషన్‌ భగీరథ ఒక జలయజ్ఞమని, ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా తెలంగాణలోని సుమారు 23,839 గ్రామాల్లో 57.01 లక్షల ఇండ్లకు, మున్సిపాలిటీల్లో విలీనమైన 649 గ్రామాలకు, 121 మున్సిపాలిటీలు, అడవులు, కొండలపై ఉన్న 136 గ్రామీణ ఆవాసాలకు తాగు నీరు అందుతున్నదని తెలిపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా మహబూబ్‌ నగర్‌ గ్రామీణ మండలం మన్యంకొండలోని మిషన్‌ భగీరథ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండగ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని మాట్లాడారు. వంద శాతం ఇంటింటికి మంచినీరు ఇస్తున్న రాష్ట్రం, 80 శాతం రక్షిత మంచి నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.