తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే బెస్ట్

– నేరాల నియంత్రణలో కీర్తి గడిస్తున్న సూపర్ కాప్స్
– ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఫ్రెండ్లీ పోలీస్
– అత్యాధునిక టెక్నాలజీతో కేడీల చేతులకు బేడీలు
– శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యం
– ఈ నిజం తెలిసిన విజనరీ నేత సీఎం కేసీఆర్
– అందుకే అధికారంలోకి రాగానే పొలీస్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం
– కేసీఆర్ ఆలోచనల నుంచి ఉద్భవించిన మణిహారమే “పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్
– నిరంతర నిఘా నేత్రంది నేరాల అదుపులో ప్రధాన పాత్ర
– తెలంగాణలో ఉన్నన్ని సీసీ కెమెరాలు ఎక్కడా లేవు
– తెలంగాణ నేడు సుభిక్షంగా ఉందంటే సురక్షితం కాబట్టే
– 27రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణ లో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు
– ఇందుకు హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్
– పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ -కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు దేశంలోనే బెస్ట్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించిన సురక్షా దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ..
నేరాల నియంత్రణలో ఎనలేని కీర్తి గడిస్తున్న సూపర్”కాప్స్” మన తెలంగాణ పోలీసులు అని అభినదించారు. నేరం జరిగిన కొద్ది గంటలలోనే నేరాన్ని ఛేదించి నేరగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనే వార్తలు వినే సమయంలో వారి పనితీరును రాష్ట్ర ప్రజలంతా ప్రశంసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఫ్రెండ్లీ పోలీస్ ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులంటే ప్రజలు భయపడేవారని, అనవసరంగా ఇబ్బంది పెడతారనే అపోహలు ఉండేవని ఇప్పుడు అవేమీ లేవని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యాధునిక టెక్నాలజీతో కేడీల చేతులకు బేడీలు వేస్తున్న పోలీసుల సమర్థవంత పనితీరు వల్ల తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతు న్నారన్నారు. ఏ రాజ్యంలో పోలీసు వ్యవస్థ, సైనిక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసి ప్రశాంత వాతావరణం కలిపిస్తుందో ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుందని చాణుక్యుడి రాజనీతి శాస్త్రంలో పేర్కొన్నట్లు
శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని ఆయన పేర్కొంటూ ఈ నిజం తెలిసిన విజనరీ నేత కాబట్టే సీఎం కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ముందు పొలీస్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. కేసీఆర్ గారిది అంబేద్కర్ మార్గమని, సమీకరించు, బోధించు, పోరాడు అన్న అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే కేసీఆర్ చావునోట్లో తల పెట్టి 35 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. అదే ఉద్యమ స్పూర్తితో కేసీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే జరిపిన తొలి విదేశీ పర్యటనలో ఆయనతో కలిసి తాను కూడా సింగపూర్, మలేషియా దేశాలకు వెళ్లానని, అక్కడి పోలీసింగ్ చూసి కేసీఆర్ ఆశ్చర్య పోయారని ఆయన గుర్తు చేశారు. రోడ్ల మీద ఎక్కడా పోలీసులు కనిపించరని, కానీ నేరం జరిగితే క్షణాల్లో పోలీసులు రోడ్డు పైకి రావడం చూసి నివ్వెర పోయిన కేసీఆర్ గారు ఇందుకు కారణమైన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ లో కూడా ఉండాలనుకున్నారన్నారు. కేసీఆర్ గారి ఆలోచనల నుంచి ఉద్భవించిన మణిహారమే “పోలీసు కమాండ్ కంట్రోల్” అని జీవన్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణలో ఉన్నన్ని సీసీ కెమెరాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, నిరంతర నిఘా నేత్రందే నేరాల అదుపులో ప్రధాన పాత్ర అని ఆయన తెలిపారు. తెలంగాణ నేడు సుభిక్షంగా ఉందంటే సురక్షితం కాబట్టేనని, 27రాష్ట్రాలకు చెందిన 30లక్షల మంది తెలంగాణ లో ప్రశాంత జీవనం సాగిస్తూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారంటే శాంతి భద్రతల పరిస్థితి బ్రహాండంగా ఉండటం వల్లనేనని ఆయన అన్నారు. ఇందుకు హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ అంటూ జీవన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. “తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే నక్సలిజం సమస్య మళ్లీ పెరుగుతుందని, హైదరాబాద్‌ నగరంలో మతకల్లోలాలు పెచ్చరిల్లుతాయని ఎన్నో అపోహలు ప్రచారం అయ్యాయి. అవి కేవలం అపోహలే కాదు సమాజంలోని మేధావివర్గం నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ, అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ పదేండ్లలో సురక్షిత, సుఖశాంతుల తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. యావత్‌ దేశంలోనే భద్రమైన రాష్ట్రంగా తెలంగాణ ఘనకీర్తిని చాటడంలో, తెలంగాణ పునర్‌ నిర్మాణంలో పోలీసులది అత్యంత కీలక పాత్ర’ అయ్యింది. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ వెంటనే పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. పోలీస్‌ శాఖలో తీసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ, ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పటిష్టమైన శాంతి భద్రతలు ఏర్పడ్డాయి. నేరాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ 9 ఏండ్లలో కల్పించారు. ప్రశాంతత అంటే ఇలా ఉండాలని, దేశానికే ఒక రోల్‌మోడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దారు.
పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షన్‌ సెంటర్లు, ప్రజలు కూర్చోవడానికి విజిటింగ్‌ ఏరియాలు, టాయిలెట్స్‌ తదితర వసతులు ఏర్పాటు చేశాం. దీనివల్ల ప్రజల్లో పోలీసుల పట్ల ఎంతో సానుకూలత ఏర్పడింది. దీంతో రాష్ట్రమంతటా అన్ని పోలీస్‌ స్టేషన్లలో అద్భుతమైన ఫ్రంట్‌ ఆఫీస్‌ వ్యవస్థ ఏర్పాటు జరిగింది. పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ భారం లేకుండా నగర పోలీస్‌ స్టేషన్లకు రూ.75 వేలు, పట్టణ పోలీస్‌ స్టేషన్లకు రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాల పోలీస్‌ స్టేషన్లకు రూ.25 వేలు నెలవారీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వచ్చిన తొమ్మిదేండ్లలోనే పోలీస్‌ శాఖలో దాదాపు 45 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ జరిగింది. అధికార వికేంద్రీకరణ జరిగి, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా, ఏడు నూతన పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. 10 కొత్త పోలీసు జిల్లాలు, 25 సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ ఆఫీసులు, 31 సర్కిల్‌ ఆఫీసులు, 111 నూతన పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు, కొత్త జిల్లాలలో నూతన పోలీస్‌ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ముఠాల కట్టడికి రాష్ట్రస్థాయిలో యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో, సైబర్‌ సెక్యురిటీ బ్యూరోలు ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. ‘అర్ధరాత్రి కూడా మహిళలు నిర్భయంగా బయట సంచరించగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ చెప్పిన మాటలను సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రస్తావించేవారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే మహిళా భద్రత గురించి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి స్వయంగా షీ టీమ్స్‌కు రూపకల్పన చేశారు” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నేర రహిత సమాజ స్థాపనకు తెలంగాణలో ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటూ నేరస్తులకు మాత్రం సింహ స్వప్నంగా మారుతున్నారు. దీంతో పోలీసులపై నేడు ప్రజలు పూర్తి విశ్వాసాన్ని పెంచుకున్నారు. మరో పక్క ‘హాక్‌ ఐ’ యాప్‌తో పోలీసులు, ప్రజలకు మధ్య వారధిగా ఉపయోగిస్తున్నారు. పలు రకాలైన సేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెట్రోలింగ్‌ వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక పెట్రోలింగ్‌ కార్లు, బ్లూకోట్స్‌ వాహనాలను సమకూర్చారు. డయల్‌ 100 నుంచి పెట్రోలింగ్‌ వ్యవస్థతో అనుసంధానం చేశారు. దీంతో బాధితులు ఫోన్‌ చేస్తే ఐదు నిమిషాల్లో ఘటన స్థలికి పోలీసులు చేరుకుంటూ అత్యంత వేగంగా పోలీస్‌ సేవలను అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ముఖ్య ప్రాంతాలు, డ్యామ్‌లు, ప్రార్థన, పర్యాటక సంస్థలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసే సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ను దీనికి అనుసంధానం చేశారు. అలాగే విపత్తుల సమయంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ఇక్కడి నుంచి ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు తగిన ఏర్పాటు చేశారు అని జీవన్ రెడ్డి తెలిపారు. నిరంతరాయంగా ట్రాఫిక్‌ సమస్యను నివారించడానికి అత్యాధునిక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగర శివారులలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ైప్లెఓర్‌లు, అండర్‌పాస్‌లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సాఫీగా ట్రాఫిక్‌ సాగే నగరాల్లో దేశంలోనే హైదరాబాద్‌ మొదటి వరుసలో నిలిచింది. ట్రాఫిక్‌ నిబంధనలు ప్రజలు పాటించే విధంగా వారిలో అవగాహన కల్పిస్తూ, పటిష్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా చేయడంతో వాహనదారుల్లో క్రమ శిక్షణ పెరిగి ప్రయాణం సుఖవంతమవుతున్నదని ఆయన అన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోననే ఆందోళన మరిచి ప్రజలు హాయిగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు. 9 ఏండ్లుగా ఒక్క చిన్నపాటి మతపరమైన గొడవలు జరగలేదంటే పటిష్టమైన పోలీసింగ్‌ వ్యవస్థ ఉండడం, తద్వారా పటిష్టమైన శాంతి భద్రతలు కొనసాగుతుండడమే కారణమని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పధంలో పురోగమిస్తూ పంటలు పండించడంలో,తలసరి ఆదాయంలో, పల్లె,పట్టణ ప్రగతిలో, ఇంటింటికి మంచి నీళ్ళు అందించడంలో, ప్రపంచ స్థాయి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడంలో -ఇలా అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచి అవార్డుల మీద అవార్డులు సాధిస్తోందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీసుల పనితీరు అద్భుతం అని జీవన్ రెడ్డి అభినందించారు.