12 మంది ప్రముఖులకు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన 12 మంది ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలను అందజేయనుంది. వర్సిటీ ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో గింజల నరసింహారెడ్డి (కవిత), తేరాల సత్యనారాయణశర్మ (పరిశోధన), బి నరహరి (చిత్రలేఖనం), ఈమని శివనాగిరెడ్డి (శిల్పం), మేలట్టూర్‌ ఎస్‌ కుమార్‌ (నృత్యం), పి పూర్ణచందర్‌ (సంగీతం), జి వల్లీశ్వర్‌ (పత్రికారంగం), దెంచనాల శ్రీనివాస్‌ (నాటకరంగం), వెడ్మ శంకర్‌ (జానపద కళారంగం), ముదిగొండ అమరనాథ శర్మ (అవధానం), కొండపల్లి నీహారిణి (ఉత్తమ రచయిత్రి), జి అమృతలత (నవల/కథ) ఉన్నారని తెలిపారు. నాంపల్లి ప్రాంగణంలో ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఒక్కొక్కరికీ రూ.20,116 నగదుతో సత్కరిస్తామని పేర్కొన్నారు.