ముగిసిన టెట్‌ దరఖాస్తు గడువు

– 2.83 లక్షల దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు గడువు బుధవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. రాత్రి తొమ్మిది గంటల వరకు టెట్‌కు 2,83,620 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌, టెట్‌ కన్వీనర్‌ ఎం రాధారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 2,90,941 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారని తెలిపారు. వారిలో పేపర్‌-1కు 80,990 మంది, పేపర్‌-2కు 20,370 మంది, రెండింటికీ కలిపి 1,82,260 మంది కలిపి 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. వచ్చేనెల 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 టెట్‌ రాతపరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహిస్తారు. ఇతర వివరాలకు https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే టెట్‌ దరఖాస్తు గడువు పొడిగించాలంటూ అభ్యర్థులు కోరినా విద్యాశాఖ అధికారులు పొడిగించకపోవడం గమనార్హం. దరఖాస్తు గడువు పొడిగిస్తే రాతపరీక్షల నిర్వహణపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు.