– సాయి ఆశయ సాధనకు కృషి చేద్దాం
– సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడుతూ అందరితో మమేకమై జీవించడం కొందరికే సాధ్యమని, అలాంటి ధన్యజీవి బల్ల సాయికుమార్ అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాష అన్నారు. సాయి సంస్మరణ సభ గురువారం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్‌లో సిపిఐ పట్టణ కార్యదర్శి అకోజ్ సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పాష మాట్లాడుతూ చిన్న వయసులోనే సాయి మన నుండి దూరం కావడం బాధాకరమని, కానీ పుట్టిన వారు మరణించక తప్పదని చెప్పారు. సాయి లాంటి సంఘజీవి మరణించినప్పటికీ చిరకాలం ప్రజల గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోతారని అన్నారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ చిన్న వయసు నుండే కమ్యూనిస్టుభావాజాలానికి ఆకర్షితుడైన సాయి విద్యార్థి దశ నుండి పోరాటాల్లో పాలుపంచు కున్నారని చెప్పారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకునిగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేశాడని అన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువజన సమస్యల పరిష్కారం దిశగా అనేక పోరాటాలు రూపొందించారని చెప్పారు. ఏఐటీయూసీ జిల్లా కార్య దర్శిగా, డివిజన్ కార్యదర్శిగా కార్మిక రంగ సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారని తెలిపారు. సాయి కుటుంబానికి సిపిఐ అండదండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కల్లూరు వెంకటేశ్వరరావు, భద్రాద్రి వెంకటేశ్వరరావు, ఎస్వీఎస్ నాయుడు, నరాటి ప్రసాద్, మువ్వా రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.