ఆ బాధ్యత పార్లమెంటుదే

That is the responsibility of Parliament– స్వలింగ సంబంధాలను చట్టబద్ధం చేయలేం : సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : ప్రస్తుత రూపంలోని ప్రత్యేక వివాహ చట్టం రాజ్యంగ స్వభావాన్ని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్ధించింది. అయితే, స్వలింగ సంపర్కుల సంబంధాలకు చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించడంపై చర్చించి, నిర్ణయించాల్సిన బాధ్యతను పార్లమెంట్‌కు విడిచిపెట్టింది.
స్వలింగ సంపర్కమనేది కేవలం పట్టణ ప్రాంతాలకు లేదా కులీన వర్గాలకు మాత్రమే పరిమితమైన భావన కాదని ఐదుగురు న్యాయమూర్తులు అంగీకరించారు. అయితే స్వలింగ సంపర్కుల మధ్య సంబంధాలను లాంఛన ప్రాయంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించగలదా లేదా అనే అంశంపై న్యాయమూర్తులు పరస్పరం విభేదించుకున్నారు. స్వలింగ సంపర్కులైన జంటలను గుర్తించేందుకు ఒక క్రమబద్దీకరణ యంత్రాంగాన్ని రాజ్యాంగ అధికారులు రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, మరో న్యాయమూర్తి జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ అభిప్రాయపడ్డారు. వివాహ బంధంలోకి ప్రవేశిం చేందుకు లైంగికత ప్రాతిపదికగా ఒక జంటకు గల హక్కును నియంత్రించలేమని ఇరువురు న్యాయ మూర్తులు అభిప్రాయపడ్డారు. లైంగికత ప్రాతిపదిక న వివక్ష చూపడమనేది రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఎస్‌.ఆర్‌.భట్‌, హిమా కోహ్లి, పి.ఎస్‌.నరసింహలు ఈ పాయింట్‌తో విభేదించారు. క్రమబద్దీకరణ యంత్రాంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత పార్లమెంట్‌దని, న్యాయస్థానానిది కాదని స్పష్టం చేశారు. అయితే1954నాటి ప్రత్యేక వివాహ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది కాదని ఐదుగురు న్యాయమూర్తులు అంగీకరించారు.
స్వలింగ వివాహాలను మినహాయించ నక్కరలేదని పేర్కొన్నారు. అయి తే, స్వలింగ వివాహాలను ఆ చట్ట పరిధిలోకి తీసుకు రావడానికి ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించాల న్నది సూచించదగ్గ అంశం కాదని స్పష్టం చేశారు.