కోటి మొక్కల నాటడమే లక్ష్యం

– సీఎస్‌ శాంతికుమారి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 26న చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంఘాలు సహా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని శుక్రవారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశించారు. అదే సందర్భంలో సంక్షేమ పథకాల పురోగతిని కూడా సమీక్షించారు. గొర్రెల పంపిణి, బీసీ, మైనారిటీలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూ పట్టాల పంపిణి, సామాజిక భద్రతా పింఛనులు, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్దీకరణ, వీఆర్‌ఓల క్రమబద్దీకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్‌ జలీల్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు.