– వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
– రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
నవతెలంగాణ-కోట్‌పల్లి
రైతును రాజు చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలు బార్వాద్ రైతు వేదిక మోత్కుపల్లి క్లస్టర్ వద్ద స్థానిక సర్పంచ్ వెంకటేష్ యాదవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మోత్కుపల్లి కరీంపూర్ నాసన్ పల్లి, బీరోల్, జిన్నారం తదితర గ్రామాల నుండి రైతులు కార్యకర్తలు భారీగా ఎడ్లబండ్లతో ట్రాక్టర్లతో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాలను 21వ రోజులు వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయాలను సాధించిందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సదుపాయం రైతుబంధు రైతు బీమా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. సాగు నీటి కోసం కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు ఇప్పటికే 80శాతంకు పైగా పూర్తయ్యాయని ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాల కోసం మండలానికి కొన్ని క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతు వేదికలు కట్టించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. అన్నదాతే దేశానికి అన్నపూర్ణ అని రైతు లేనిదే రాజ్యం లేదు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రైతుబంధు సహాయం ద్వారా రైతులకు ఎరువులకు విత్తనాలకు కొరత లేకుండా పోయిందని తెలిపారు. అనంతరం రైతులకు అధికారులకు ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనీల్, బార్వాద్ సర్పంచ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, మోత్కుపల్లి సర్పంచ్ పాండురంగారెడ్డి, నాసన్ పల్లి సర్పంచ్ పద్మ నాగార్జున రెడ్డి, బీరోల్ సర్పంచ్ సూర్య కళ మాణిక్యం, జిన్నారం సర్పంచ్ వెంకటయ్య, తహసీల్దార్ అశ్వక్ రసూల్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, విద్యుత్ ఏఈ సురేష్ రెడ్డి, ఏపీఎం శివ్వయ్య, ఏఈఓ అయ్యప్ప, వివిధ శాఖల అధికారులు రైతుబంధు గ్రామ కమిటీ అధ్యక్షుడు మైనో దీన్, జిన్నారం ఎంపీటీసీ బందయ్య, పంచాయతీ కార్యదర్శి మసియోద్దీన్, టెక్నికల్ అసిస్టెంట్ హరి ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ అనంతయ్య, సీనియర్ నాయకులు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.