గో రక్షకుల దారుణం

– గోమాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు..మహారాష్ట్రలో ఘటన
నాసిక్‌ : మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో గో సంరక్షకులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఓ యువకుడిని కొట్టి చంపారు. మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. యువకులు ఆవు మాంసాన్ని రవాణా చేస్తున్నారన్న అనుమానంతో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అఫాన్‌ అబ్దుల్‌ మజీద్‌ అన్సారీ, నాసిర్‌ హుస్సేన్‌ షేక్‌ అనే వ్యక్తులు ఓ కారులో 450 కిలోల మాంసాన్ని ముంబయికి రవాణా చేస్తుండగా 10-15 మంది గో సంరక్షకులు అటకాయించి ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీ ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన 11 మంది దుండగులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. రవాణా చేస్తున్న మాంసం నిషిద్ధ జాతికి చెందినదా కాదా అని తెలుసుకునేందుకు దానిని ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపారు. కాగా నాసిక్‌ జిల్లాలోనే ఈ నెల 8న ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రాష్ట్రీయ బజరంగ్‌దళ్‌కు చెందిన గో సంరక్షకులు ఒక వ్యక్తిని చంపి, మరో ఇద్దరిని గాయపరిచారు. వీరు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.