ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

– నూతన అటవీ పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయాలి
– టీఏజీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
ఆదివాసీ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని, నూతన అటవీ పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని టీఏజీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. శుక్రవారం కొమరం భీం 83వ వర్థంతి సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతన అటవీ సంరక్షణ చట్టం తీసుకువచ్చిందని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్‌ 3ని ఆర్డినెన్స్‌ ద్వారా రూపకల్పన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొమరం భీం జల్‌ జంగిల్‌ జమీన్‌ అంటూ ఆనాటి నిజం సర్కార్‌ని ఎదిరించిన గోండు వీరుడు స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆనాటివి ఆటవి శాఖ అధికారులు జరిపిన దాడుల్లో కొమరం భీమ్‌ తండ్రి మరణించిన అనంతరం 15 ఏండ్ల చిన్న వయసులోనే 1928 సంవత్సరం నుండి సామాజిక ఉద్యమం చేస్తూ ఆనాటి నిజం సర్కార్‌ని గడగడలాడించారు అని అన్నారు. మహా యోధుడు కొమరం భీమ్‌ను 1940 సంవత్సరంలో అదిలాబాద్‌ జిల్లా జోడేఘాట్లో అతి దారుణంగా కాల్చి చంపిన ఆనాటి నిజం ప్రభుత్వం దుర్మార్గమైన ఘటన అని అన్నారు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరతరాలుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీల సాగు చేస్తున్న వారందరికీ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిక చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్న ఆదివాసి నిరుద్యోగులు అందరూ లక్షలాదిమంది ఉద్యోగులు కోసం ఎదురుచూస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయన్నారు. ఆదివాసి హక్కుల జోలికొస్తే కేంద్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికైనా ఆదివాసీల అందర్నీ ఐక్యం చేస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు సున్నం గంగా, భద్రాచలం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సోయం జోగారావు, కుంజా శ్రీను, కొర్స రవి, శిరీష తదితరులు పాల్గొన్నారు.