రోగుల పట్ల సంబంధిత డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

– ప్రభుత్వ ఆసుపత్రిలో పీవో ఆకస్మిక తనిఖీలు
– రోగులను ప్రయివేటు ఆసుపత్రులకు తరలిస్తే కఠిన చర్యలు
నవతెలంగాణ-భద్రాచలం
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎంత భయంకరమైన వ్యాధి అయిన ఇక్కడనే నయమయ్యేలా సంబంధిత డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం చేయాలని, రోగులు ఎవరిని ప్రభుత్వ ఆసుపత్రిలో తప్ప ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపకూడదని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ పోట్రు వైద్యశాఖ సిబ్బందిని సూచించారు. శుక్రవారం భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిని పీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా ఆసుపత్రి అన్ని విభాగాలను ప్రత్యేకంగా కాన్పుల విభాగమును సందర్శించి గర్భిణీలతో వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కెసిఆర్‌ కిట్టు, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్టు అందుబాటులో ఉన్నాయా లేదా అని అందరికీ అందుతున్నాయా లేదా అని ఆసుపత్రి సూపర్డెంట్‌ రామకృష్ణని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు అందరికీ కేసీఆర్‌ కిట్టు పుట్టిన బిడ్డకు న్యూట్రిషన్‌ అందేలా చూడాలని బిడ్డ పుట్టిన వెంటనే బరువు బట్టి ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని అన్నారు. ఆస్పత్రిలో తగినన్ని మందులు అందుబాటులో ఉండాలని మందుల కొరత అనేది ఉండకూడదని ప్రభుత్వం రోగుల కోసం ఖరీదైన మందులు సరఫరా చేస్తున్నందున ఆసుపత్రి ముందు మెడికల్‌ షాపులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. మన వద్ద అవసరం అయిన మందులు ఉన్నప్పుడు బయట కొనవలసిన అవసరం ఏంటని డీఎంహెచ్‌ఓను అడిగారు. ఎన్‌ఆర్‌సి రక్తనిధి కేంద్రం, ఆపరేషన్‌ థియేటర్‌, రక్త పరీక్షల ల్యాబ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. నూతనంగా నిర్మించిన కిచెన్‌ షెడ్‌ సందర్శించి రోగులకు సమయానికి భోజన వసతి కల్పించడానికి అన్ని రకాల హంగులతో నిర్మాణం పూర్తి చేయాలని ఈఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శిరీష, ఈఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌ తానాజీ, సహాయక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కే.రాజకుమార్‌, డాక్టర్‌ చైతన్య ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌, ఎంసీహెచ్‌ సూపర్డెంట్‌ రామకృష్ణ, ప్రోగ్రాం మేనేజర్‌ రాముడు, ఆర్‌ఎంఓ రాజశేఖర్‌ రెడ్డి, డాక్టర్‌ సంతోష్‌, నర్సింగ్‌ రామలక్ష్మి, పుష్ప, మాలతి, భవాని వైద్య విధాన పరిషత్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.