
నవతెలంగాణ- కంటేశ్వర్
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రతి బూత్ కు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించే ప్రక్రియపై మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బిన్ హందన్,రూరల్ ఇంచార్జ్ భూపతిరెడ్డి ,పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెలా నర్సారెడ్డి, బాన్సువాడ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మండల అధ్యక్షులు తమ మండలంలోని ప్రతి బూత్ కు ఏజెంట్ను నియమించాలని, తద్వారా ఓటర్ జాబితాలో జరిగే అవకతవకలను నియంత్రించగలమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కష్టపడి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని, రాబోయే 90 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని భయంతో మతిస్థిమితం కోల్పోయి ఏమీ మాట్లాడలో తెలీక కాంగ్రెస్ పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కవిత మరియు ప్రశాంత్ రెడ్డి అవినీతిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని,ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రెండు లక్షల రూపాయలు ఇస్తామని, పేద ప్రజల వైద్యం కొరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని,నిరుద్యోగ యువతకు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఆసరా పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని, 18 సంవత్సరాలు నిండి చదువుకునే ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని మానాల మోహన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.