– ఎన్నికల వాగ్దానం మేరకు ప్రతి ఇంటికీ రూ.5.5 లక్షలివ్వాలి
– ఆదాయం, కులం, సదరం సర్టిఫికెట్లు తప్పనిసరనే నిబంధనను ఎత్తేయాలి
– గుడిసె వాసులందర్నీ అర్హులుగా గుర్తించాలి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదో తేదీని తుది గడువుగా నిర్ణయించడం సరిగాదనీ, గడువును పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కుల, ఆదాయ, సదరం ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జమచేయాలనే నిబంధన లబ్దిదారులను కుదించే చర్య అని విమర్శించారు. ఆ నిబంధనను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే వారం నుంచి పది రోజులు పడుతుందని పేర్కొన్నారు. కేవలం రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలనీ, ఆ ధ్రువీకరణ పత్రాలను జతచేయాలనటం దారుణమని పేర్కొన్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇంటి స్థలమున్న వారికి రూ.5.5 లక్షలు ఇస్తామంటూ బీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. రూ. 3 లక్షలతో ఇల్లు ఎలా పూర్తవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. వారికి నివాసస్థల పట్టా ఇవ్వడంతో పాటు గృహలక్ష్మి లబ్దిదారులుగా గుర్తించాలని కోరారు. వ్యక్తిగత వాంగ్మూలం ఆధారంగా గుడిసె వాసుల దరఖాస్తులను అధికారులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలనీ, అందులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉండే విధంగా చూడాలని కోరారు.