యూనిఫాం సివిల్‌ కోడ్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

– ఆ తర్వాతే తెలంగాణ గడ్డపై ప్రధాని అడుగు పెట్టాలి : మేడే రాజీవ్‌ సాగర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూని ఫాం సివిల్‌ కోడ్‌ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ డిమాండ్‌ చేశారు. మైనార్టీలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని పేర్కొన్నారు. భిన్న సంస్కృతులతో విరాజిల్లుతున్న దేశం లో మతచిచ్చు పెట్టి మైనార్టీలను అణగతొక్కే ప్రయత్నాన్ని మానుకో వాలని హితవు పలికారు. దళితులు ఏ మతంలో ఉన్నా వివక్షకు గురవుతూనే ఉన్నారనీ, వారికి రిజర్వేషన్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత దళితుడిపై మూత్రం పోయటం దారుణమనీ, మత ఛాంద స వాదుల వల్ల దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మైనార్టీల పై దాడులు జరుగుతుంటే ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ప్రధాని మోడీ అక్కడకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. తెలంగాణలో మత ఘర్షణలు సృష్టించి రాజకీయాలు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. గుజరాత్‌కు లక్షల కోట్ల రూపాయల నిధులిస్తున్న కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాకే తెలంగాణకు రావాలని సూచించారు.