అమరవీరుల త్యాగాల ఫలితమే భద్రాద్రి అభివృద్ధి

– ప్రజలకు అండగా నిలవడమే భీష్మారావుకు మనం ఇచ్చే నివాళి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌
నవతెలంగాణ-భద్రాచలం
అమరవీరుల త్యాగాల ఫలితంగానే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే అమరజీవి కామ్రేడ్‌ బత్తుల భీష్మారావుకు మనం ఇచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్‌ అన్నారు. బత్తుల భీష్మారావు 38వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీలో అభివృద్ధి నిరోధక శక్తులుగా ఉన్న ఆనాటి మావోయిస్టు గూండాలు విఆర్‌పురం మండలం జీడిగుప్ప అటవీ ప్రాంతంలో కాపుగాచి దాడి చేసి ప్రాణాలు తీశారని అన్నారు. ఈ దాడిలో బత్తుల భీష్మారావు అక్కడికక్కడే మృతి చెందారని, కామ్రేడ్‌ చందర్రావు నెల రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారని గుర్తు చేశారు. ఆ దాడిలో ఆనాటి ఎమ్మెల్యే కుంజా బొజ్జి, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యలకు గాయాలు అయ్యాయని అన్నారు. భద్రాచలం ఏజెన్సీలో మారుమూల గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అనేకమంది సీపీఐ(ఎం) నాయకులు బండారు చందర్రావు, బత్తుల భీష్మారావు, శ్యామల వెంకటరెడ్డి, పులి రామయ్య, మడివి మూకయ్య మొదలగు నాయకులను మావోయిస్టు గూండాలు హత్య చేశారని అన్నారు. సీపీఐ(ఎం) నాయకులు త్యాగాల ఫలితంగానే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఎర్రజెండాను ముందుకు తీసుకోవాలని రానున్న ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్‌ బాబులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకట రామారావు, యన్‌.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు ఎన్‌.నాగరాజు, భూపేంద్ర, కున్జా శ్రీనివాస్‌, సత్య, సీనియర్‌ నాయకులు ఏం.వి.ఎస్‌ నారాయణ, నేలపట్ల భాస్కర్‌ రెడ్డి, అజరు కుమార్‌ పాల్గొన్నారు.