ఆదివాసీల అభివృద్ధి దేశ ప్రగతికి సూచిక

– గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌
– ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-బేగంపేట్‌
ప్రకృతిలో భాగమై నిజాయితీకి మారుపేరుగా నిలిచే ఆదివాసీలు అన్నిరంగాల్లో ఎదిగినప్పుడే దేశం ప్రగతి సాధించినట్టు అవుతుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదివాసీ హక్కుల పరిరక్షణకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. రాజభవన్‌ ఇప్పటికే నాలుగు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ మహిళలు రక్తహీనత వంటి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఐరన్‌ టాబ్లెట్స్‌ వంటి అలోపతి మందులను వేసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారని, దాంతో ఐరన్‌ ఎక్కువగా లభించే సహజ సిద్ధమైన మెగువ పూలతో తయారుచేసిన లడ్డూలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రోడ్లు లేని ప్రాంతాల్లో టూ వీలర్‌ అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందేలా చూస్తున్నామన్నారు. తమ దృష్టికి వచ్చిన పోడు భూముల పట్టాలు కేటాయింపు, రిజర్వేషన్ల అమలు విద్యా, వైద్యం తదితర ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్యలు చేపడతామని చెప్పారు. అనంతరం రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల అమలు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. గుత్తి కోయలు, చెంచులు తదితర ఆదివాసీ తెగలు నేటికీ నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమన్నారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న గుత్తి కోయలకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా వాటి అమలుతీరులో ఉన్న లోపాల కారణంగా ఆదివాసీలు వెనుకబాటు తనానికి గురవుతున్నారన్నారు. వారు అన్ని రంగాల్లో ఎదగాలంటే చట్టాల అమలులో లోపాలు తొలగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆదివాసీలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఆదివాసీ మహిళా చైతన్య శక్తి అధ్యక్షులు డాక్టర్‌ పద్మజ, ఆదివాసీ నేత అశోక్‌ చౌదరి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి, విద్యులత, ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.