– నివాళ్లర్పించిన నాయకులు సోమయ్య, నున్నా
నవతెలంగాణ-కారేపల్లి
ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తుదిశ్వాస వరకు ఆదర్శకమ్యూనిస్టుగా మాలోత్ మదారమ్మ(70) నిలిచారని సీపీష(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.సోమయ్య, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కారేపల్లి మండలం చీమలపాడుకు సీపీఐ(ఎం) సీనియర్ సభ్యురాలు మాలోత్ మదారమ్మ వయోభార అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. మదారమ్మ మృతదేహాన్ని సీపీఐ(ఎం) నేతలు సందర్శించి భౌతికకాయంపై పార్టీ పతాకాన్ని ఉంచి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చీమలపాడు ప్రాంతంలో సీపీఎం పేదల తరుపును చేసిన కూలి, తునికాకు, జీతాలు పెంపు, పోడు పోరాటాల్లో భర్త అమరజీవి మాలోత్ నానునాయక్‌తో కలిసి ఉద్యమించిందన్నారు. భర్త మాలోత్ నానునాయక్‌ను భూస్వామ్య గూండాలు పొట్టన పెట్టుకున్నా అధైర్యపడక పార్టీలో చురుకైన కార్యకర్తగా పయనించారన్నారు. పోడు భూములలో అధికారుల నిర్బంధాలను ఎదిరించి తండాను ఏర్పాటు చేశారని, ఆ తండాకు నానునగర్ అనే పేరు స్ధిరపడిందన్నారు. మదారమ్మ కుటుంబం నేటికి ఉద్యమ కేంద్రంగా కొనసాగుతుందని తెలిపారు. మదారమ్మ కుమారులు మాలోత్ హనుమ, అరుణ్ కుమార్‌లను నాయకులు ఓదార్చారు. నివాళ్లు ఆర్పించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు కరపటి సీతారాములు, ధారావత్ సైదుల,ు యనమనగండ్ల రవి, మాలోత్ రామకోటి, మాలోత్ శోభన్, మద్దెల నాగయ్య, పాటి రంగయ్య, కిషోర్, మాలోత్ లక్ష్మి, దస్రునాయక్, స్వామి తదితరులు ఉన్నారు.