నెర్రెలుబారిన నేల దేశానికే ధాన్యాగారం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తొమ్మిదేండ్లలోనే నెర్రెలు బారిన తెలంగాణ నేల దేశా నికి ధాన్యాగారమైం దంటే… దానికి ముఖ్య మంత్రి కేసీఆర్‌ నేతృత్వం లోని రైతు ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాల వల్లనే ఈ అద్భుతం సాధ్యమైందని చెప్పారు. రైతు బంధు పథకం ద్వారా 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.66 వేల కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. రైతు బీమా ద్వారా ఒక్కో రైతుకు రూ. 5 లక్షల చొప్పున లక్షా 782 రైతు కుటుంబాలకు రూ.5,039 కోట్లు పరిహారంగా చెల్లించిందని తెలిపారు. 27 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణయేనని స్పష్టం చేశారు. ప్రతిదశలోనూ రైతుకు అండగా ఉండేందుకు 10,769 గ్రామాల్లో రైతుబంధు సమితులను ఏర్పాటు చేశామని తెలిపారు. భూయాజమాన్య హక్కులపై స్పష్టత ఇచ్చేందుకుగానూ భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన చేపట్టి ధరణి ద్వారా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని వివరించారు.
రైతులను సంఘటితం చేసేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ చొప్పున 2,601 రైతువేదికల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల లభ్యతతో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. పండిన పంట నిల్వకు నూతన మార్కెట్‌ షెడ్లు, గోదాముల నిర్మాణం, పండిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడం తదితర చర్యల మూలంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుండి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగిందని పేర్కొన్నారు. 2014లో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి నేడు 2.60 కోట్ల టన్నుల మెట్రిక్‌ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్బంగా వెల్లడించారు.