చదువుల పండుగను వైభవంగా జరపాలి

– ఉన్నత విద్యామండలి సమావేశంలో వాకాటి కరుణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న చదువుల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకాడమిక్‌ అంశాలపై పలు నిర్ణయాలను తీసుకున్నారు. అసెస్మెంట్‌, ఎవ్యాలుయేషన్‌ సిస్టమ్‌పై ఐఎస్‌బీ ఇచ్చిన నివేదికపై ఆ సంస్థ పక్షాన ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ శ్రీపాద, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గరిమ మాలిక్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ విషయంపై వైస్‌ ఛాన్సలర్లు తమ అనుభవాలను వివరించారు. పలు సూచనలను చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అసెస్మెంట్‌, ఎవాల్యుయేషన్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సెక్టార్‌ స్కిల్‌ కోర్సులను ఎక్కువ మంది విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇందుకోసం ఎక్కువ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రస్తుత ఏడాది నుంచే ప్రవేశపెట్టనున్నారు. అలాగే బీ.ఎస్సీ (హానర్స్‌) కంప్యూటర్‌ కోర్సును కూడా ప్రారంభించడానికి కావాల్సిన విధి, విధానాలను రూపొందించారు. డిగ్రీ చదివే ప్రతి విద్యార్థికి వ్యాల్యూ అడిషన్‌ లో భాగంగా నాలుగు క్రెడిట్ల సైబర్‌ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, ఆయా విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు పాల్గొన్నారు.