ఆఖరి కావ్యం….

బుల్లెట్‌
బట్టలు తొడుగుకుంటుందా
శూలం
చీరలు చుట్టుకుంటుందా

ఇప్పుడు నువ్వు వివస్త్రగా ఊరేగించిన నేను అంతే

మందుపాతరనై
నీ మదోన్మాదాన్ని
కూకటివేళ్ళతో సహా పెకలిస్తాను
నిప్పులు చిమ్మే ఈటెనై
నీ రాజ్యాధికార కోరికను
తునాతునకలు చేసేస్తాను

అనుకుంటున్నావ్‌ కానీ
నువ్వు ఊరేగించినది
నా నగ దేహాలనని
అవి పూర్తిగా
నీ కుళ్లూ కుతంత్రాల గుర్తులు
భ్రమ పడుతున్నావ్‌ కానీ
నువ్వు చిత్రించి పంచిపెట్టింది
నా వివశత్వాలని
అవి మీ పైశాచికత్వపు ఆనవాళ్లు

గో టు హెల్‌
పురుషుడా గో టు హెల్‌
మీరు విధించిన
సిగ్గూ మానాల చట్రం చుట్టూ తిరగలేక
ఏక పక్ష నీతీ న్యాయాల
ఈలల్ని భరించలేక
తరాలుగా అలసిపోయాం

కమ్‌ ఆన్‌
మగువా కమ్‌ ఆన్‌
చరిత్ర నిండా నింపబడ్డ
మానవమానాల బరిలో నలిగి
మతోన్మాద కూపపు శాపంగా మిగిలి
ఇంకెన్నాళ్ళని ఏడుస్తూ కూర్చుందాం

పిచ్చోడి చేతిలో రాయిలా
ఇప్పుడు మన శీలం
దోచుకోబడుతోంది
ఆడుకోబడుతోంది
ఎరగా వాడుకోబడుతోంది

మూర్ఖుల మదిలోని ఆలోచనలా
ఇప్పుడు మన దేహం
అధికార వాంఛలకు
అడ్డగోలు పాలకులకు
నియంతత్వ పోకడలకు నిలయమౌతోంది

ఊరేగింపులు
ఊరడింపులు మధ్యన నలిగున్న
మన అంతరాత్మలకైన గాయాన్ని
ఇక రేగనీయవద్దు
స్వ పర కాష్టాల కాల్చివేతలతో
చిద్రమైన దేహాలకు
ఆలోచనల చితిని అంటించకండి

జాగో మహిళా జాగో
మన దింగంబర ఊరేగింపు
మనకో మేలుకొలుపు
ఈ స్వతంత్ర భారతాన
జరిగిన వస్త్రాపహరణ
ఇంటింటి పాంచాలుల శపథానికి
ఒక పూనిక
కూలబోతున్న
దుష్ట దైత్య పాలనకు
తుది సూచిక….

– సుధా మురళి