– ఉద్వేగభరితం.. మేడారం..
– లక్షలాది జనాల నడుమ గద్దెపై సారలమ్మ
– నేడు సమ్మక్క రాక
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ములుగు/తాడ్వాయి
వనమంతా జనమయంతో మేడారం మహా జాతర ఉద్వేగభరితంగా ప్రారంభమైంది. ఆదివాసీల సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించే డప్పు డోలు వాయిద్యాలతో బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన జాతర.. జనసంద్రంగా మారింది. లక్షలాది మంది ఎదురుచూస్తుండగా వనదేవత సారలమ్మను వడ్డె కాక సారయ్య, ఇతర వడ్డెలు బుధవారం రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించారు. ముందుగా మేడారం గ్రామానికి 3 కి.మీ దూరంలోని కన్నెపల్లిలో మధ్యాహ్నం నుండే సారలమ్మ దేవాలయం వద్ద మహిళలు ముగ్గులు వేసి అలంకరించారు. పూజారి కాక సారయ్య.. ఆదివాసీ ఆచార, వ్యవహారాలతో పూజలు చేయగా.. మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు గుడి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వడ్డెలు డోలు వాయిద్యాలు వాయిస్తూ, కొమ్ములూదుతూ ముందుకు కదలగా మహిళలు దండాలు పెడుతూ స్వాగతం పలికారు. ఏటూర్‌నాగారం ఐటీడీఏ పీవో అంకిత్, ములుగు జిల్లా అడిషనల్ ఎస్పీ సంకీర్త్, డీఎస్పీ రవీందర్ నేతృత్వంలోని భారీ బందోబస్తు, రోప్ పార్టీ నడుమ వడ్డేలు సారలమ్మలను తోడ్కొని బయలుదేరారు. జంపన్నవాగు మీదుగా లక్షలాది మంది ప్రజల నడుమ సారలమ్మ గద్దెలపై కొలువుతీరింది. దారి పొడవునా వడ్డెలను తాకడానికి మహిళలు తీవ్రంగా ప్రయత్నించారు. వడ్డెలు సజావుగా సారలమ్మను తీసుకురావడానికి ఆదివాసీ సంఘం, తుడుందెబ్బ యువకులు వారికి రక్షణగా నిలిచారు. సారలమ్మను వడ్డె కాక సారయ్య గద్దెలపై ప్రతిష్టించాక, మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపారి, అడిషనల్ కలెక్టర్ శ్రీజ తదితరులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో సారలమ్మను దర్శించుకున్నారు.
గద్దెలకు చేరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు
సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొస్తున్న క్రమంలోనే మేడారానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి మంగళవారం ఉదయం పెనక వంశీయులైన వడ్డెలు పగిడె రూపంలో ఉన్న సమ్మక్క భర్త పగిడిద్దరాజును తోడ్కొని గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో రాత్రి బస చేశారు. అనంతరం బుధవారం ఉదయం తిరిగి కాలినడకన బయలుదేరి సాయంత్రం జంపన్నవాగు పరిసర ప్రాంతం మీదుగా మేడారం గద్దెల వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అలాగే, మేడారానికి 18 కి.మీ దూరంలో ఉన్న ఏటూరునాగారం మండలం కొండాయిలో ఉన్న గోవిందరాజులు దేవాలయంలో వడ్డెలు పొదెం బాబుతో పాటు మరికొందరు పూజారు లు ప్రత్యేక పూజలు నిర్వహించి పగిడె రూపంలో ఉన్న గోవిందరాజులను తీసుకుని బుధవారం కాలినడకన బయలుదేరారు. దేవాలయం నుండి వడ్డెలు బయటకు రాగానే గ్రామానికి చెందిన మహిళలు దండాలు పెడుతూ స్వాగతం పలికారు. రాత్రికి మేడారం గద్దెలపై గోవిందరాజును ప్రతిష్ఠించారు. కాగా, చిలుకలగుట్ట నుంచి గురువారం సమ్మక్కను గద్దెలపైకి తీసుకురానున్నారు. జాతరలోని పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, శ్రీజ, ఐటీడీఏ పీవో అంకిత్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్, అడిషనల్ ఎస్పీ సదానందం, డీసీపీ మురళీధర్, తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు కోరెగట్ల లక్ష్మణ్‌రావు, ఏటూర్‌నాగారం తహసీల్దార్ ఖాజా సిదరొద్దీన్, సీఐ రాజు తదితరులు పాల్గొన్నారు.