– డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం..
నవతెలంగాణ-బంజారాహిల్స్
డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలంటూ ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు ఇద్దరు మాయగాళ్లు. ఈ మేరకు ఇద్దరిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం నర్రెగూడం గ్రామానికి చెందిన ఎం.డి.గౌస్ పాషా, గుంటి శేఖర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దాని ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని సంగారెడ్డి కలెక్టర్‌కు సిఫారసు లేఖ పంపారు. అయితే, అధికారులు ఈ విషయాన్ని మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. మంత్రి పేరుతో నకిలీ లెటర్ హెడ్ తయారు చేశారని తేలడంతో మంత్రి ఓఎస్‌డీ డా.రాజేశ్వర్‌రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులు గౌస్‌పాషా, గుంటి శేఖర్‌పై కేసు దర్యాప్తు చేస్తున్నారు.