జూలై ఐదు వరకు సర్కారుకు గడువు..

– తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి…
– ఈ నెల 24న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు
– తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జూలై ఆరు నుంచి గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు నిరవధిక సమ్మె చేయనున్నట్టు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌ యజ్ఞా నారాయణ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఈ నెల 5న జేఏసీ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌కు అందజేసినట్టు తెలిపారు. పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికుల మాదిరిగా కేటగిరీల వారీగా వేతనాలను రూ.15,600, రూ. 19,500, రూ.22,750గా పెంచాలని జేఏసీ డిమాండ్‌ చేసిందని గుర్తు చేశారు. మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలనీ, కారోబార్‌, బిల్‌ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలనీ, పెండింగ్‌ బిల్లులు తక్షణమే చెల్లించాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసు ప్రభుత్వ అధికారులకు అందజేశామని జేఏసీ నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21లోగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు లేదంటే.. ఏ రోజునుండైనా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతామని తెలిపారు.
12 రోజులు గడిచినప్ప టికీ, రాష్ట్ర ప్రభుత్వం జేఏసి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించలేదని జేఏసీ నేతలు తెలిపారు. దీంతో శనివారం మరోసారి పంచాయతీ రాజ్‌ శాఖ కమిష నర్‌ ఎం. హనుమంతరావు (ఐఎఎస్‌)ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కమిషనర్‌ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామనీ, ఇతర సమస్యలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఈ మేరకు కమిషనర్‌ తెలిపారు. ప్రధాన సమస్యలపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సమస్యల పరిష్కా రం కోసం ఆందోళన – పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వ హించాలని పిలుపునిచ్చింది. సమ్మె సన్నాహక సద స్సులు జరపాలని కోరింది. జూలై ఐదో తేదీ లోపు సమస్యలు పరిష్కరించాలనీ, లేకుంటే మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని జేఏసీ తెలిపింది. సమ్మెనోటీసును అందజేసిన వారి లో జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌ (సీఐటీయూ), టీజీకేబీయూ జనరల్‌ సెక్రటరీ ఎన్‌ యజ్ఞనారాయణ, ఏఐటీయూసీ నాయకులు బి వెంకటరారజం, సలహా దారు కె. సూర్యం (ఐఎఫ్‌టీయూ), కన్వీనర్లు పి.శివ బాబు (ఐఎఫ్‌ టీయూ), ఎన్‌ దాసు(ఐఎఫ్‌టీయూ), సిహెచ్‌ వెంకట య్య (సీఐటీయూ), టి.నర్సింహారెడ్డి (ఏఐటీయూసీ), కో కన్వీనర్‌ జయచంద్ర (ఏఐటీయూసీ), పాలడుగు సుధాకర్‌(సీఐటీయూ), కమిటీ సభ్యులు గ్యార పాండు (సీఐటీయూ),పుట్ట యాదమ్మ (సీఐటీయూ) తదితరులు పాల్గొన్నారు.