నెల రోజులు సమ్మె చేస్తున్నా..ప్రభుత్వానికి చలనం రాదా?

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్‌
– జీపీ కార్మికుల సమ్మెకు సీపీఐ(ఎం) సంఘాభావం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చలనం రావడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్‌, మండల కార్యదర్శి జంగయ్య విమర్శించారు. పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 34వ రోజుకు చేరింది. వారికి సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కొరడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఓ పక్క నిత్యావసర ధరలు పెరిగినా కార్మికుల వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పని చేస్తున్న వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. కారోనా కాలంలో ప్రజాప్రతినిధుల కన్న జీపీ కార్మికులు, ప్రజలకు ఎక్కువ సేవ చేశారని గుర్తు చేశారు. అర్హులైన గ్రామపంచాయతీ కార్మికులకు దళితబంధు, ఇండ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మీ వర్తింపజేయాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులు చేసే సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో గ్రామపంచాయతీ సిబ్బంది చేసే ఆందోళనల్లో ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లేశ, మండల నాయకులు గణేష్‌, దాసు, యాదగిరి, కార్మికులు మల్లేష్‌, సత్తిరెడ్డి, భాస్కర్‌, నర్సింహ, బాల్‌ రాజ్‌, ఉస్మాన్‌, సత్యనారాయణ, అబ్బయ్య, అబ్బమ్మ, అండాలు, యాదమ్మ, సుశీల, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.