నవతెలంగాణ- బీజింగ్: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు. యూయు కౌంటీ సమీపంలోని యాంగ్‌క్యాన్హె టౌన్షిప్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇక్కడికి సమీపంలో ఒక నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు అడ్డంకిగా నిలవడంతో పాటు యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి తరలించడానికి గ్రేట్ వాల్ అడ్డుగా ఉంది. దీనివలన వారు పని చేసుకునే చోటికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారిద్దరు కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను కొంతవరకు కూల్చేశారు. ఆగస్టు 24న స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చేసిన గోడను చూసి విభ్రాంతికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందన్న ఒకేఒక్క కారణంతో నిందితులు చైనా ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన భారీ గోడ సమగ్రతకు సుస్థిరతకు తీవ్రనష్టం కలిగించారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.