దేశంలో ఆరోగ్యవ్యవస్థ నిర్వీర్యం

The health system in the country is weak– కేంద్రంలోని దోపిడీ సర్కార్‌ వల్లే వైద్యానికి అనారోగ్యం
– సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి..కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. నరేంద్రమోడీ సర్కారు దేశ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ట్విటర్‌లో మండిపడ్డారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఎయిమ్స్‌ లలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ‘కేంద్రంలోని దోపిడీ సర్కార్‌ దేశ ఆరోగ్య వ్యవస్థను అనారోగ్యంగా మార్చింది. మోడీజీ మాట్లాడే ప్రతి మాటలో కేవలం అబద్ధాలు మాత్రమే ఉంటాయి. దేశవ్యాప్తంగా చాలా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, దేశంలోని ఎయిమ్స్‌లు తీవ్రంగా వైద్యులు, సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా సమయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించింది. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు. కానీ, ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. మీ ప్రభుత్వానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది’ అని ఖర్గే ట్వీట్‌ చేశారు.